Rains in Andhra Aradesh: వర్షాలకు రాష్ట్రంలోని అనేక వాగులు ఉప్పొంగి ప్రహిస్తున్నాయి. రహదారులపై వరదతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అసలే గోతులు తేలిన రహదారులు.. వర్షాలకు నీటి కుంటల్లా తయారయ్యాయని వాహనదారులు.. గగ్గోలు పెడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లల్లోకి నీరుచేరి అసౌకర్యానికి గురయ్యారు.
స్థానికంగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో.. ఎన్టీఆర్ జిల్లాలో వాగులు ఉరకలు వేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు వద్ద మున్నేరు.. ఉద్ధృతంగా ప్రవహిస్తోంది తిరుపతమ్మ ఆలయం వద్ద కేశఖండశాల.. దుకాణ సముదాయాల్లోకి వరద నీరు చేరింది. బోస్‌పేటలో 50 ఇళ్లు ముంపునకు గురయ్యాయి. గుమ్మడిదూరు, అనిగండ్లపాడు వద్ద.. మున్నేరు పంట పొలాల్ని ముంచెత్తింది.
108 డ్రైవర్ సాహసం: వత్సవాయి మండలం లింగాల.. పెనుగంచిప్రోలు వంతెనలు నీట మునిగాయి. ఖమ్మం జిల్లాకు రాకపోకలు పూర్తిగా నిలిచాయి. వత్సవాయికి చెందిన డయాలసిస్ రోగికి అత్యవసర వైద్యం అందించేందుకు.. ప్రతికూల పరిస్థితుల్లోనూ 108 వాహన డ్రైవర్ వంతెన దాటించాడు. కంచికచర్ల మండలం కీసర వద్ద మున్నేరు, కట్టలేరు, వైరా ఏరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దాములూరు వద్ద నందిగామ - వీరులపాడు మండలాలకు రాకపోకలకు నిలిచాయి.
ప్రమాదకరస్థాయిల్లోవాగులు: తిరువూరు నియోజకవర్గంలోనూ.. వాగులు ప్రమాదకరస్థాయిల్లో ప్రవహిస్తున్నాయి. తిరువూరు మండలం చౌటపల్లి ప్రధాన రహదారిపై.. గుంతలు ప్రమాదకరంగా మారాయి. తిరువూరు - గంపలగూడెం రహదారి ఛిద్రమైంది. కనుగుల చెరువు, మల్లమ్మ చెరువుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. కట్టలు తెగే ప్రమాదముందని రైతులు ముందస్తుగా ఇసుక బస్తాలు అడ్డు వేశారు.
13 గ్రామాలకు నిలిచిన తాగునీటి సరఫరా: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో.. అంగన్‌వాడీ కేంద్రంలోకి వర్షపు నీరు చేరింది. పల్లగిరి కొండ వద్ద.. తాగునీటి సరఫరా చేసే పైలెట్ ప్రాజెక్టులోకి మున్నేరు వరద నీరు చేరింది. 13 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచింది. ఏలూరు జిల్లా పెదపాలపర్రులో పంటపొలాలు మునిగాయి. నందిగామ మండలం సత్యవరంలో పత్తి, వరి పొలాలు నీట మునిగాయి. మాగల్లువద్ద వరినాట్లు పూర్తిగా మునిగాయి. పెనమలూరు మండలంలో వేల ఎకరాల్లో ఇదే పరిస్థితికనిపిస్తోంది.
ఆగిన రాకపోకలు: అల్లూరి జిల్లాలో.. కొండ వాగులు పొంగిపొర్లుతున్నాయి. ముంచింగి పుట్టు బిరిగుడ, లక్ష్మీపురం గడ్డ, పెదబయలు మండలంలో గంజిగడ్డ, పాడేరు జి.మాడుగుల మండలాల్లో మత్స్య గడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. దేవీపట్నం మండలం వెలగపల్లి గ్రామ సమీపంలో కొండ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రంపచోడవరం నుంచి.. రంప గ్రామానికి వెళ్లే రహదారిలో సీతపల్లి వాగుపై నిర్మించిన వంతెన నీట మునిగింది. రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల్లో.. పలు గ్రామాలకు రాకపోకలు ఆగాయి.
Munneru Flood: మున్నేరు వరదల్లో చిక్కుకున్న 10 మంది రైతులు, కూలీలు
నీటమునిగిన వందలాది ఇళ్లు: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో.. సుమారు 5 వేల ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. కోమర్తి అంగన్‌వాడీ కేంద్రంలోకి వరద నీరు చేరింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో శివారు కాలనీల్లో 200 ఇళ్లు నీటమునిగాయి. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముంపు కాలనీల పర్యటనకని వచ్చి.. తమను పరామర్శించకుండా వెళ్లిపోయారని బాధితులు వాపోయారు.