Purandeshwari Fire on YSRCP Govt: ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా.. రైతుల గోడు పట్టించుకునే పరిస్థితిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం లేదని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన.. ఏ ఒక్క హామీనీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చలేదని దుయ్యబట్టారు.
BJP Kisan Morcha Program Updates: విజయవాడలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా చిగురుపాటి కుమారస్వామి, ఇతర సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం, కాలువల నిర్వహణను గాలికొదిలేశారని పురందేశ్వరి మండిపడ్డారు. అన్నదాతలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నా.. సాగుదారులకు మేలు కలిగించే రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని ఆమె దుయ్యబట్టారు.
Purandeshwari Comments: ''కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పథకాలకు స్టిక్కర్లు వేసుకుని, ప్రయోజనం పొందాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల ఎకరాల్లో పంటలు పండించలేని దుస్థితి నెలకొంది. వైసీపీ పాలనలో రైతుల భవిష్యత్తు అంధకారం అయిపోయింది. రాష్ట్రంలోని సాగునీటి సమస్యలను జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సాగునీటి ప్రాజెక్టుల పనులు ముందుకు సాగడం లేదు. సాగునీరు లేక, వర్షాలు కురవక రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. అసలు.. ఎన్ని నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించారు..? అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఏం చేసింది..? ఈ రాష్ట్రంలో వ్యవసాయ, నీటిపారుదల శాఖ మంత్రులు ఎవరో ప్రజలకు తెలుసా..?'' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
Satyakumar Comments: అనంతరం బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ప్రసంగిస్తూ.. వ్యవసాయ, నీటిపారుదల శాఖలకు చెందిన మంత్రులు రైతుల అవస్థలపై ఏమైనా సమీక్షలు చేశారా..? అని ప్రశ్నించారు. వ్యవసాయ రంగాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆయన మండిపడ్డారు. ఫసల్ బీమా యోజన అమలు కాకుండా జగన్ ప్రభుత్వం అడ్డుకుందని ఆగ్రహించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు.
''ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. కులాల మధ్య వైషమ్యాలు పెంచి, ప్రాంతాల మధ్య గొడవలు సృష్టించి ఓట్లు పొందుదామని ప్రయత్నం చేస్తున్నారే తప్ప.. రైతాంగం గురించి గానీ, నిరుద్యోగ, మహిళల రక్షణ గురించి ఆలోచించడం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించేందుకు డిసెంబర్ 1 నుంచి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గ్రామదర్శన యాత్ర చేపట్టబోతున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం.''-వై. సత్యకుమార్, బీజేపీ జాతీయ కార్యదర్శి