Problems of Jagananna Colonies in AP : పేదల కోసం నిర్మించిన జగనన్న కాలనీలు చూస్తే చెరువులో కాలనీ కట్టారా లేక, కాలనీకి చెరువును తీసుకొచ్చారా అన్నది చెప్పడం కొంత కష్టమే. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువశాతం జగనన్న కాలనీలు చిన్నపాటి వర్షం కురిసినా చెరువులను తలపిస్తున్నాయి. గ్రామాలకు దూరంగా లోతట్టు ప్రాంత భూముల్లో, కొండ వాలు ప్రాంతాల్లో, ముంపు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించడంతో చిన్నపాటి వర్షం కురిసినా కాలనీలు తటాకాలను తలపిస్తున్నాయి. పైగా ఆయా కాలనీల్లో మెరక కోసం ఏకంగా రూ. 2,200 కోట్లతో చదును చేయించినా ముంపు సమస్య వీడలేదు. సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటంతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. మళ్లీ ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో మెరక చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
Condition of Jagananna Colonies in Kakinada District : కాకినాడ జిల్లా కొమరగిరి శివారులో 400 ఎకరాల్లో ఏర్పాటు చేసిన భారీ జగనన్న కాలనీ నీటిలో నానుతోంది. రాష్ట్రంలోనే మొట్టమొదటి జగనన్న కాలనీ ఇదే. స్వయంగా సీఎం జగన్ ప్రారంభించిన కాలనీ పరిస్థితే ఇలా ఉందంటే ఇక మిగిలిన వాటి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక్కడ మెరక పనుల కోసం రూ. 70 కోట్లు కేటాయించారు. ఈ కాలనీ పరిస్థితి చూస్తేనే తెలుస్తుంది ఆ నిధులేమయ్యాయో? ఎవరి జేబుల్లోకి వెళ్లాయో? అదే విధంగా కాకారపల్లిలోని జగన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇళ్ల మధ్యకు భారీగా వరద నీరు చేరింది.
Problems of Jagananna Colonies in Nellore District : నెల్లూరు రూరల్ మండలంలోని అక్కచెరువుపాడు జగనన్న కాలనీ పేరుకు తగ్గట్టే చెరువును తలపిస్తోంది. చిన్నపాటి వర్షానికి నివాసాల చుట్టూ నీరు చేరుతుండగా, రోడ్లన్నీ బురదమయంగా తయారవుతున్నాయి. ఈ రోడ్లపై అడుగు తీసి అడుగు వేయాలంటే సాహసం చేయాల్సిందే. పేదలను మరింత పేదలుగా చూసేందుకే జగనన్న తమకు ఇలాంటి నివాసాలు కట్టిస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలోని పడుగుపాడు జగనన్న లేఔట్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
అమ్మబోతే అడవి.. కొనబోతే కొరవి.. ఇదీ జగనన్న కాలనీల పరిస్థితి
Present Situation of Jagananna Colonies in Krishna District : కృష్ణా జిల్లా వణుకూరులోని జగనన్న కాలనీలో మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచాయి. చిన్నపాటి వర్షం కురిసినా కాలనీ చెరువును తలపిస్తుండటంతో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ఎన్టీఆర్ జిల్లా అనాసాగరంలో జగనన్న కాలనీల్లో వర్షం నీరు పోటెత్తింది. నిర్మాణంలో ఉన్న ఉన్న ఇళ్ల మధ్య నీరు నిలిచిపోయింది. వాగు పక్కనే ఉన్న స్థలం కొనుగోలు చేయడంతో వర్షాలు కురిసిన ప్రతిసారీ వాగుపొంగి కాలనీని ముంచెత్తుతోంది. దాదాపు ఐదు అడుగుల మేర మెరక లేపితే గానీ ఇళ్లు నిర్మించుకునేందుకు వీలుకాకపోవడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. బాపట్ల జిల్లా చినపులివర్రులో జగనన్న కాలనీలో నడుములోతు నీరు నిలిచిపోయింది.
జగనన్న కాలనీల లేఔట్‌లో మెరక చేయడం, అంతర్గత రహదారుల నిర్మాణం కోసం అధికారులు చాలా రోజులుగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సుమారు మరో వందకోట్లు విడుదల చేయాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా మౌనం వహిస్తున్నారు.
Jagananna Colonies జగనన్న కాలనీలా! చెరువులా!.. ఇల్లు నిర్మించాక పరిస్థితి ఏంటంటున్నలబ్ధిదారులు