Prepare GPS Proposed Ordinance as Alternative to CPS: ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా సర్కార్ తెరపైకి తెచ్చిన జీపీఎస్ ప్రతిపాదిత ఆర్డినెన్సు సిద్ధమైంది. అది ఇంకా ఉన్నతస్థాయిలో పరిశీలనలో ఉంది. అందులో ఆరో భాగం నాలుగో అంశంలో ఒక కీలకాంశం ఉంది. పెన్షన్ నిధికి ఉద్యోగి, ప్రభుత్వం కలిసి జమ చేసిన మొత్తంలో నుంచి ఉద్యోగి మధ్యలో లేదా చివర్లో కొంత మొత్తాన్ని తీసుకుంటే అది గ్యారంటీ పెన్షన్‌పై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అంటే ఉద్యోగి చివరి మూలవేతనంలో 50 శాతాన్ని గ్యారంటీ పెన్షన్‌గా ఇస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడు పెన్షన్ నిధి నుంచి ఉద్యోగి కొంత మొత్తం తీసుకుంటే నెలనెలా ఇచ్చే పెన్షన్ మొత్తం తగ్గుతుందని స్పష్టం చేయబోతుందన్నమాట. తద్వారా పెన్షన్ గ్యారంటీ ప్రశ్నార్థకమవుతోంది.
No Guarantee For 50 Percent Pension :పెన్షన్ విధానాల మధ్య వ్యత్యాసాన్ని పరిశీలిస్తే... పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి ఎలాంటి మొత్తమూ చెల్లించనక్కర్లేదు. ఆఖరి నెల డ్రా చేసిన మూలవేతనంలో 50 శాతం పింఛను లభిస్తుంది. పెన్షనర్ మరణిస్తే భాగస్వామికి అందులో సగం చెల్లిస్తారు. దీనికి నాటి కరవు భత్యమూ కలుపుతారు. ఆరునెలలకోసారి ద్రవ్యోల్బణం ఆధారంగా కేంద్రం ప్రకటించే కరవు భత్యం మొత్తాన్ని డీఆర్ రూపంలో ఇస్తారు.
అయిదేళ్లకోసారి ప్రభుత్వం పీఆర్సీ ప్రకటిస్తుంది. ఫిట్‌మెంట్, డీఆర్‌లను బట్టి మూల పెన్షన్ మొత్తం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు జీపీఎఫ్‌కు ప్రతి నెలా తమ మూలవేతనంలో 6 శాతం చెల్లిస్తారు. ఏడాదికి ఇది 5 లక్షలకు మించకూడదు. పదవీవిరమణ సమయంలో ఈ మొత్తం 25 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉద్యోగి తిరిగి పొందుతారు. పెన్షనర్లకు వయసు ఆధారంగా అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సౌలభ్యమూ ఉంది. ఆరోగ్య పథకం అమల్లో ఉంది.
Ministers Committee Meeting with Employees Unions on GPS: జీపీఎస్‌లో మరికొన్ని అంశాలు చేర్చాలన్న ఉద్యోగ సంఘాలు.. అధ్యయనం చేసి నిర్ణయమన్న మంత్రుల కమిటీ
సీపీఎస్ విధానం 2004 నుంచి అమలవుతోంది. ఉద్యోగి మూలవేతనం నుంచి 10 శాతం, ప్రభుత్వం మరో 10 శాతం పెన్షన్ నిధికి జమ చేయాలి. కేంద్రం తాజాగా 14 శాతంగా మార్చినా ఏపీలో మారలేదు. పదవీ విరమణ సమయంలో ఆ నిధి నుంచి ఉద్యోగి 60 శాతంగా వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన 40 శాతం యాన్యుటీ పెన్షన్ స్కీంలో పెట్టుబడిగా పెడతారు. ఆ పథకం ఫలితాలను బట్టి ప్రతి నెలా కొంత మొత్తం ఉద్యోగికి పింఛనుగా అందుతుంది. ప్రస్తుత లెక్క ప్రకారం.. ఉద్యోగి ఆఖరి నెల తీసుకునే మూలవేతనంలో 20.3 శాతమే పింఛనుగా వస్తుందని ఒక అంచనా. ఇది కూడా మార్కెట్ పరిస్థితులను బట్టి తగ్గే అవకాశం ఉంది. పదవీ విరమణ తర్వాత ఆరోగ్య పథకం కూడా ఉద్యోగులకు వర్తించదు. ఓపీఎస్‌లో ఉన్న ఇతర వెసులుబాట్లు లేవు.
ప్రస్తుతం ప్రభుత్వం గ్యారంటీ పెన్షన్ పథకం కోసం ఆర్డినెన్సు తీసుకురాబోతోంది. అందులో ప్రతిపాదిత అంశాలను పరిశీలిస్తే.. ఉద్యోగి నుంచి 10 శాతం వాటా, ప్రభుత్వమూ 10 శాతం పెన్షన్ నిధికి జమ చేస్తారు. కేంద్రం 14 శాతానికి పెంచిన అంశంపై స్పష్టత లేదు. జీపీఎస్‌ను ఆప్షన్‌గా ఎంచుకోవాలి. అంటే సీపీఎస్ కొనసాగుతుందా అన్నది ప్రశ్నార్థకమే. సీపీఎస్‌లో ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత అప్పటి వరకు జమయిన నిధిలో నుంచి 60 శాతాన్ని ఉద్యోగి వెనక్కు తీసుకోవచ్చు. మిగిలిన 40 శాతాన్ని యాన్యుటీ పెన్షన్ పథకంలో (Investment in Annuity Pension Scheme) పెట్టుబడి పెట్టాలి.
ఆ స్కీం ఆధారంగా కొంత మొత్తం పెన్షన్ వస్తుంది. ప్రతిపాదిత జీపీఎస్‌లో పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగి మూలవేతనంలో 50 శాతం పెన్షన్‌కు గ్యారంటీ ఇస్తున్నారు. అయితే జమ చేసిన పెన్షన్ నిధి నుంచి 60 శాతం మొత్తం వెనక్కు తీసుకునేందుకు వీల్లేదు. అలా ఎంత వెనక్కి తీసుకుంటే దాన్ని బట్టి పెన్షన్ తగ్గిపోతుంది. మరి ఇక జీపీఎస్‌తో గ్యారంటీ పెన్షన్ ఎలా వస్తుందన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఒక ఉద్యోగి 60 వేల మూలవేతనంతో పదవీ విరమణ చేస్తే ఆయనకు గ్యారంటీ పెన్షన్ పథకంలో 30 వేల పెన్షన్ వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఆ ఉద్యోగికి పెన్షన్ నిధి దాదాపు 60 లక్షలు జమ అయితే.. ఆ ఉద్యోగి ఆ నిధిలో నుంచి ఏ మొత్తమూ తీసుకోకూడదు. కొంత నిధి తీసుకున్నా గ్యారంటీ పెన్షన్ తగ్గిపోతుంది. అదే సీపీఎస్ విధానంలో 60 లక్షల నిధి నుంచి 60 శాతం మొత్తం వెనక్కు తీసుకోవచ్చు.
అంటే దాదాపు 36 లక్షలు వెనక్కు తీసుకుంటారు. మిగిలిన 24 లక్షలు పెన్షన్ స్కీంలో పెట్టుబడి పెడతారు. తక్కువలో తక్కువ 12 శాతం వడ్డీ వచ్చిందనుకున్నా 24,000 పెన్షన్ వస్తుంది. అంటే జీపీఎస్‌తో పోల్చితే సీపీఎస్‌లో ఉద్యోగి కోల్పోయేది నెలకు కేవలం 6 వేలే. కానీ జీపీఎస్‌లో ఆ 6వేల కోసం ఉద్యోగి కోల్పోయేది 36 లక్షలు. జీపీఎస్‌లో పెన్షన్ నిధి ఇవ్వకుండా పెన్షన్‌కు గ్యారంటీ ఇచ్చి ఉపయోగమేంటి అనేది పెద్ద ప్రశ్న.
ఇది మరో రకంగా దగా తప్ప పాత పెన్షన్ పథకం ఓపీఎస్‌తో ఏ రకంగానూ సరిపోలదనే ఆందోళన వ్యక్తమవుతోంది.పెన్షనర్‌కు ఆరు నెలలకు ఇచ్చే డీఆర్‌పై కూడా ఆర్డినెన్సులో స్పష్టత ఇవ్వలేదు. తదుపరి రూపొందించే మార్గదర్శకాల్లోనే అది వివరిస్తామని ఆర్థిక శాఖ పేర్కొన్నట్లు తెలిసింది.ఓపీఎస్‌లో ఉన్న అనేక మెరుగైన సామాజికభద్రత అంశాలు కూడా ఇందులో లేవు. వీటన్నింటిని పరిశీలిస్తే ఇక జీపీఎస్ ఏ రకంగా మెరుగైనదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Employees Opposes GPS: 'సీపీఎస్ రద్దు చేయలి..లేకపోతే ఐక్యంగా ఉద్యమిస్తాం'