station bail misuse: తెలంగాణలోని పలు పోలీసు ఠాణాల్లో స్టేషన్ బెయిళ్ల పేరిట లంచాల వసూళ్ల పర్వం కొనసాగుతోందనే ఆరోపణలొస్తున్నాయి. పోలీసులు ఏసీబీకి చిక్కేది ఎక్కువగా ఈ వ్యవహారాల్లోనే కావడం దీన్ని బలపరుస్తోంది. తాజాగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బేగంపేట ఠాణా పరిధిలో ఒక బాధితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.12 వేలు లంచం తీసుకుంటూ.. ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ నరేశ్‌లు మంగళవారం అవినీతి నిరోధకశాఖ(అనిశా)కు చిక్కారు.
station bail misuse in Telangana : ఏడేళ్లలోపు శిక్ష పడే అవకాశమున్న చిన్న కేసుల్లో నిందితుల్ని రిమాండ్‌కు తరలించవద్దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన మినహాయింపును కొందరు పోలీసు అధికారులు ఇలా దుర్వినియోగం చేస్తున్నారు. నిందితులు లంచం ఇచ్చేవరకు ఠాణాల చుట్టూ తిప్పుతున్నారు. ఒక్కో కేసులో రూ.10-30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
చేయి తడపకుంటే కక్ష తప్పదు: ఏడేళ్ల లోపు శిక్ష పడే నేరాల్లో 41 సీఆర్‌పీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్) కింద దర్యాప్తు అధికారికి విచక్షణాధికారం ఉంటుంది. దీని ప్రకారం నిందితుడికి 41ఏ నోటీసు ఇచ్చి సంజాయిషీ అడగవచ్చు. దానికి నిందితుడి సమాధానం సంతృప్తికరంగా ఉందని భావిస్తే అరెస్టు చేయరు. నిందితుడు సాక్ష్యాల్ని తారుమారు చేస్తాడనో లేక విదేశాలకు పారిపోయే అవకాశముందనో అధికారి భావిస్తే రిమాండ్‌కు తరలించవచ్చు.
What does 41 CRPC say: ఇది పూర్తిగా దర్యాప్తు అధికారి ‘విచక్షణ’ మీద ఆధారపడి ఉంటుంది. దీన్నే కొందరు పోలీసు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. లంచం ఇవ్వకుంటే రిమాండ్‌కు పంపిస్తామని బెదిరిస్తున్నారు. డబ్బు ఇస్తే దర్యాప్తులో అనుకూలంగా వ్యవహరిస్తామని ఆశ చూపుతున్నారు. నేరాల్లో వాహనాలు ఇరుక్కుపోయి ఉంటే వాటిని తిరిగి ఇచ్చేందుకు మరింత ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. లంచం వచ్చే అవకాశం లేనప్పుడు.. తప్పుడు కారణాలు చూపి రిమాండ్‌కు తరలిస్తున్నారు. రాష్ట్రంలో ఏటా 1.3-1.4 లక్షల కేసులు నమోదవుతున్నాయి.
గత ఏడాది వీటి సంఖ్య 1,42,917. వీటిలో సుమారు లక్ష కేసులు స్టేషన్ బెయిల్‌కు అర్హత ఉన్నవే. వీటిలో చాలావరకు వసూళ్ల దందా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలతోపాటు కమిషనరేట్లలోనూ స్టేషన్‌బెయిళ్ల వ్యవహారాలు చూసేది దాదాపుగా ఎస్సైలే కావడంతో కానిస్టేబుళ్లు లేదా దళారుల ద్వారా వసూళ్లు చేయిస్తున్నారని సమాచారం. ఇటీవలి బ్యాచ్‌లకు చెందిన ఎస్సైలు ఇలాంటి వ్యవహారాల్లో ముందుంటున్నారనే ఆరోపణలొస్తున్నాయి.
"ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాల్లో నిందితుడిని రిమాండ్‌కు తరలించాలా? వద్దా? అనే విచక్షణాధికారం దర్యాప్తు అధికారికి ఉంటుంది. రిమాండ్ చేయని పక్షంలో 41ఏ సీఆర్పీసీ నోటీసు ఇచ్చి సంజాయిషీ అడగొచ్చు. ఒకరకంగా ఇది బైండోవర్ మాత్రమే. స్టేషన్ బెయిల్ ఇచ్చే అధికారం దర్యాప్తు అధికారులకు లేకపోయినా.. కొందరు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు".-పట్టాభి, హైకోర్టు న్యాయవాది
ఇవీ చదవండి: