Tortured the children: అభం, శుభం తెలియని చిన్నారులను చిత్రహింసలకు గురి చేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో.. వరుసకు చిన్నాన్న అయిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ గుణదలకు చెందిన రవివర్మకు, గన్నవరానికి చెందిన జ్యోతికి ఐదు నెలల కిందట ప్రేమ వివాహం జరిగింది. రవివర్మ రామవరప్పాడు సమీపంలోని ఓ ప్రముఖ హోటల్‌లో చెఫ్‌గా పని చేస్తున్నాడు. హోటల్ వారు ఉచిత వసతి కల్పించడంతో వారిద్దరూ అక్కడే నివాసం ఉంటున్నారు. జ్యోతి అక్క, బావలు 2017లో రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.
ప్రయివేటు ఉద్యోగం చేస్తున్న పిన్ని జ్యోతి.. అప్పటి నుంచి చిన్నారులను చేరదీసి వారి ఆలనాపాలనా చూస్తు వస్తోంది. ఈ వివాహం అనంతరం గత మూడు నెలల నుంచి ఆ పిల్లలు కూడా జ్యోతి, రవివర్మల వద్దకే వచ్చి ఉంటున్నారు. జ్యోతి ఉద్యోగానికి వెళ్లి సమయంలో రవివర్మ ఆ చిన్నారులపై అమానుషంగా ప్రవర్తించేవాడు. వారి వీపుపై, గుండెలపై కొట్టడం, తలను గోడకేసి బాదడం వంటి క్రూర చేష్టలు చేసేవాడు. వేడి నీళ్ల బకెట్టులో పిల్లల తల ముంచి ఊపిరి ఆడకుండా చేసి సైకోలా వ్యవహరించేవాడు.
ముక్కు, నోరు మూసి వేసి మెడ పట్టుకుని పైకి లేపేవాడు. పిన్నికి చెబితే కత్తితో మెడ కోస్తానని బెదిరించేవాడు. వారు భయపడి ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఎప్పుడైనా గమనించి జ్యోతి అడిగితే.. వారు అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని, క్రమశిక్షణ నేర్పించాల్సి ఉందని చేప్పేవాడు. ఈ నేపథ్యంలో బుధవారం రవివర్మ మరోమారు ఆ చిన్నారులను సెల్‌ఫోన్ ఛార్జరు తీగతో చితకబాదాడు.
నిందితుడిని ఆరెస్టు చేసిన పోలీసులు: ఆ తర్వాత పక్క ఇంటికి టీవీ చూడటానికి వెళ్లినప్పుడు వాళ్లు.. చిన్నారుల శరీరంపై వాతలు ఉండడాన్ని గమనించారు. వెంటనే రవివర్మ పనిచేసే హోటల్ యాజమాన్యానికి చెప్పారు. వారు పటమట ఛైల్డ్‌లైన్ ప్రతినిధులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. హోటల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రవివర్మను పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారులను ఛైల్డ్ వెల్‌ఫేర్ స్టేట్ హోమ్‌కు తరలించారు.
ఇవీ చదవండి: