POLAVARAM SADHIKARA SAMITI PRESIDENT GVR: రాష్ట్రానికి ఆర్థిక జీవనరేఖ వంటి పోలవరం ప్రాజెక్టు ప్రజలది అని.. ప్రభుత్వానిది కాదని.. ఈ ప్రాజెక్టును ఎవరు? ఎప్పుడు? ఎంత కాలంలో పూర్తి చేస్తారనే సమగ్రమైన వివరాలతో ఓ శ్వేతపత్రం ప్రకటించాలని పోలవరం సాధికార సమితి అధ్యక్షులు జీవీఆర్ శాస్త్రి డిమాండ్ చేశారు. విజయవాడలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ప్రజాసంఘాల నాయకులు వెలగపూడి గోపాలకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడారు.
"పోలవరాన్ని మేము కంప్లీట్ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. పూర్తి చేయడం కాదు.. ఎవరూ పూర్తి చేస్తారు? ఎప్పుడు పూర్తి చేస్తారు. దీనిపై కోర్టు కేసులు ఎన్ని ఉన్నాయి.. ఆ కేసులు ఎవరు వేశారు.. ఏరకంగా దీనిని సాల్వ్ చేద్దామనుకున్నారు. అసలు పరిష్కారం అవుతుందా.. అవదా..? దీనిపై సమగ్ర వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలి. పోలవరం ప్రజలది.. పార్టీలది కాదు"-జీ.వీ.ఆర్ శాస్త్రి, పోలవరం సాధికార సమితి ఛైర్మన్
రాష్ట్ర ప్రభుత్వం పోలవరం పూర్తి చేస్తామని ప్రకటనలతో సరిపెట్టడం సరికాదని శాస్త్రి విమర్శించారు. ఎప్పుడు పూర్తి చేస్తారు? కోర్టు కేసులు ఎన్ని ఉన్నాయి? ఎవరెవరు వేశారు? ఈ కేసులను ఎలా పరిష్కరించాలని అనుకుంటున్నారు? పరిష్కారం అవుతాయా? కావా? నీళ్లు ఎప్పుడు ఇస్తారు? అనే వివరాలను ప్రకటించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తే ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుందని.. తమిళనాడు, ఒడిస్సా వరకు గోదావరి జలాలను ఈ ప్రాజెక్టు ద్వారా ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు.
"మొత్తం బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటా అన్నప్పుడు.. మీనమేషాలు లెక్కట్టి.. క్రాంటాక్టర్స్ను మార్చి.. రివర్స్ టెండరింగ్‌ను పెట్టుకుని.. ఈరోజు డయాఫ్రం వాల్ రిపేర్ అంటూ చాలా ఆందోళనకు గురిచేసే పరిస్థితి కల్పించారు"-వెలగపూడి గోపాలకృష్ణ, ప్రజాసంఘాల నాయకుడు
త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతే 2030 తర్వాత నీటి సమస్య తీవ్రమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా పంటల సాగు తగ్గుముఖం పడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం విషయంలో ఇప్పటివరకు ఎన్ని నిధులు వచ్చాయి? ఇంకా ఎంత రావాల్సి ఉంది? అనే అన్ని అంశాలను వెల్లడించేందుకు ఓ కమిటీ వేసి వాస్తవాలను ప్రజల ముందు బహిరంగపరచాలని కోరారు.
"ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి, భూసేకరణకి 2013 చట్ట ప్రకారంగా 33 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. 31వేల కోట్లు ఒక్క భూసేకరణ వల్లే పెరిగింది. ఇది ఎవరు పెట్టుకోవాలి"-వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ మంత్రి
ఏప్రిల్ మొదటి వారంలో పాలకొల్లులో పోలవరం సాధికారిత సమితి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు ఉనికిని దెబ్బతీసేలా దస్త్రాలు కదులుతున్నాయని.. మరోసారి తెలుగు ప్రజలు మోసపోయేందుకు సిద్ధంగా లేరనే విషయాన్ని రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రభుత్వాల ముందు ఉంచబోతున్నామని చెప్పారు.
ఇవీ చదవండి: