Performance of Jagananna Thodu Scheme: చిరు వ్యాపారులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో 2020 నవంబర్ 25న ప్రభుత్వం జగనన్న తోడు పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలో 15 లక్షల మంది తోపుడు బళ్లు, వీధి వ్యాపారులు, వృత్తి కళాకారులు ఉన్నారు. వీరందరికీ సున్నా వడ్డీకి రుణాలు ఇస్తామని సీఎం జగన్ ఆర్భాటంగా ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సగం మందికి కూడా ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. కేవలం 3 లక్షల మందికి వ్యాపార అవసరాల కోసం ప్రభుత్వం 10 వేల రుపాయల వడ్డీ లేని రుణాలిచ్చింది. సకాలంలో రుణం చెల్లించిన వారికి మాత్రమే వడ్డీ మాఫీ చేస్తోంది. ఒక్క నెల బ్యాంక్ కిస్తీ చెల్లించకపోయినా పథకానికి అర్హత కోల్పోతున్నారు. రుణాలు తీసుకున్న 3 లక్షల మందిలోనూ ఎక్కువ మంది చిరు వ్యాపారులు వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తోంది.
"విజయవాడలో వీధి వ్యాపారాలు చేసుకునేవారు సుమారు 25 వేల మంది ఉన్నారు. వీరంతా బీసెంట్ రోడ్డు, బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. గత ప్రభుత్వం వీరికి గుర్తింపు కార్డులు ముంజూరు చేసింది. కార్డుల ఆధారంగా ప్రభుత్వం వీరికి రుణాలిచ్చేది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో జగనన్నతోడు పథకం పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతోంది తప్ప తమకు ఉపయోగపడటం లేదని చిరువ్యాపారులు చెబుతున్నారు. అప్పులు ఇచ్చేవారు లేక అధిక వడ్డీలకు అప్పు తెచ్చుకుని వ్యాపారాలు చేసుకుంటున్నామని చెబుతున్నారు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని..గుర్తింపు కార్డులు ఉంటేనే రుణాలిస్తామని చెబుతున్నారని వాపోతున్నారు. రోడ్లపై వ్యాపారం చేసుకోవాలంటే స్థానిక ప్రజా ప్రతినిధులకు, కార్పొరేషన్ అధికారులకు, పోలీసులకు కమీషన్ చెల్లించాల్సి వస్తోందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు." షేక్ అయూబ్, చిరువ్యాపారి
రాష్ట్రవ్యాప్తంగా వీధి వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని చిరు వ్యాపారుల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే వ్యాపారులు కోలుకుంటున్నారని, వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. జగనన్న తోడు పథకం అందరికీ వర్తించడం లేదన్నారు. ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో కష్టాల్లో ఉన్నవ్యాపారులను తమ సంఘం తరఫున ఆదుకుంటున్నామని తెలిపారు. మురళీ, కార్యదర్శి, విజయవాడ వీధివ్యాపారుల అసోసియేషన్
రోడ్లు, వీధుల్లో వ్యాపారులు చేసుకునే వారికి ప్రభుత్వం ఆర్ధిక స్వావలంబన కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఎగవేతదారులకు ఏమాత్రం తనఖా లేకుండా పోటీపడి రుణాలిస్తున్న బ్యాంకులు..కష్టపడి పని చేసుకునే వారికి మాత్రం రుణాలు ఇచ్చేందుకు అనేక ఆంక్షలు పెడుతున్నాయని మండిపడ్డారు. దుర్గారావు, సీఐటీయూ నాయకుడు
సీఎం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న తోడు పథకం అందరికీ వర్తింపజేయాలని చిరువ్యాపారులు కోరుతున్నారు. కనీసం బ్యాంకుల నుంచి రుణాలైనా మంజూరు చేయిస్తే తాము విడతలవారీగా చెల్లిస్తామని చెబుతున్నారు.
ఇవీ చదవండి: