Diwali Celebrations: వయసు భేదాలు లేకుండా చిన్నాపెద్దా అంతా కలిసి ఆనందంగా చేసుకునే వెలుగుల పండుగే దీపావళి. జీవితంలో అమావాస్య చీకట్లు తొలగి వెలుగులు నింపే సంతోషాల సంబరమిది. సంస్కృతి, సంప్రదాయాల మధ్య అలాంటి వేడుకను అందరూ సందడిగా చేసుకుంటున్నారు. ప్రమిదల్లో దీపారాధనలు చేస్తున్నారు. కరోనా తర్వాత చేసుకుంటున్న దీపావళి కావడంతో అందరిలోనూ సందడి నెలకొంది. బాణసంచా దుకాణాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివెళ్లారు. అంతా కలియతిరిగి కావాల్సిన వాటిని కొనుగోలు చేశారు. దీంతో దుకాణాల వద్ద ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
గతంతో పోల్చితే టపాసుల ధరలు ఎక్కువగా ఉన్నాయని.. మధ్యతరగతి కుటుంబాలు వేడుకను చేసుకునే పరిస్థితి లేదని చెప్పారు. గతంలో ఐదు వేలు వెచ్చించి కొనుగోలు చేస్తే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికి సరిపడ టపాసులు వచ్చేవని వినియోగదారులు అంటున్నారు. కానీ, ఇప్పుడు పది వేలు వెచ్చించి కొనుగోలు చేసినా కనీసం అర్థగంట కూడా కాల్చలేమని అనిపిస్తోందని అంటున్నారు. సామన్యులు టపాసులు కొనే స్థితి లేదు. మేము ఏం చేయలేము ధరలు పెరిగిపోయాయని అమ్మకందారులు అంటున్నారని ప్రజలు వాపోతున్నారు.
ఒంగోలులో నరకాసుర వధను ఘనంగా నిర్వహించారు. ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో 39 అడుగుల నరకాసురుని ప్రతిమ తయారుచేసి బాణసంచా వినియోగించి వధించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మార్కాపురంలోని నాయుడువీధిలోనూ నరకాసుర వధ నిర్వహించారు. పర్యావరణహిత వేడుకలు చేసుకోవాలంటూ విశాఖలో లోటస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. విజయవాడలో సేంద్రియ చిరు ధాన్యాలతో చేసిన స్వీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇవీ చదవండి: