Harirama Jogayya Cessation of initiation : కాపు రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్ష చేస్తున్న హరిరామజోగయ్యతో ఫోన్‌లో మాట్లాడినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మూర్ఖపు ప్రభుత్వం నిరాహార దీక్షలకు లొంగదని చెప్పానని.. వయసు, ఆరోగ్యం దృష్ట్యా దీక్ష విరమించాలని కోరినట్లు పవన్ తెలిపారు. గతంలో వైఎస్‌ను విమర్శించినప్పుడు జోగయ్య ఇంటిపై దాడి చేశారని అన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దీక్ష విరమించాలని చెప్పినట్లు వివరించారు. కాపు రిజర్వేషన్లపై ఇలా కాకుండా మరో రూపంలో పోరాడాలని జోగయ్యను కోరినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
"హరిరామ జోగయ్య ఒక బృహత్తర కార్యాన్ని తీసుకున్నారు. అది సాధ్యం కావాలంటే ముందు ఆయన ఆరోగ్యంగా ఉండాలి. ఈ వయస్సులో ఇవి ఆయన ఆరోగ్యానికి భంగం కలిగిస్తాయి. ఈ విషయాన్ని ఆయన అనుచరులు నాకు తెలియజేశారు. ఈ బృహత్తర కార్యం నుంచి పూర్తిగా కాకపోయిన తాత్కలికంగా అయిన బయటకు వచ్చి దీక్షను విరమింప చేయాలని ఆయనను కోరాను." -పవన్‌కల్యాణ్, జనసేన అధినేత
కాపు రిజర్వేషన్ల కోసం నిరాహార దీక్ష చేపట్టిన హరిరామజోగయ్య దీక్షను విరమించారు. వయసు, ఆరోగ్యరీత్యా దీక్షను విరమించాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన విజ్ఞప్తితో జోగయ్య వెనక్కి తగ్గారు. ఏలూరు ఆసుపత్రిలోనే నిమ్మరసం తాగి దీక్ష విరమించారు. అనంతరం ఆసుపత్రి నుంచి జోగయ్యను.. పాలకొల్లులోని ఆయన నివాసానికి తరలించారు.
కాపు రిజర్వేషన్ల కోసం ఆదివారం నుంచి నిరాహార దీక్ష చేస్తానని గతంలో జోగయ్య ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం దీక్షకు సిద్ధమవుతున్న ఆయనను.. పోలీసులు బలవంతంగా పాలకొల్లు నుంచి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోనే ఆయన నిరసనను కొనసాగించగా.. పవన్ వినతితో విరమించారు. దీక్ష విరమించిన అనంతరం జోగయ్య త్వరలోనే హైకోర్టుకు వెళ్లి రిజర్వేషన్ల కోసం న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.
"పవన్‌కల్యాణ్ నాకు దీక్ష విరమించాలని సలహా ఇచ్చారు. వారి సలహా మేరకు నేను దీక్ష విరమిస్తున్నాను. రిజర్వేషన్లపై హైకోర్టులో పోరాడుతాను."-హరిరామ జోగయ్య, కాపు ఉద్యమ నేత
ఇవీ చదవండి: