Outsourcing Employees Protest in AP: అరకొర జీతంతో జీవితాన్ని భారంగా మోస్తున్నామంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డెక్కారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. విజయవాడలో నిర్వహించిన పొరుగు సేవల ఉద్యోగుల రాష్ట్ర మహాసభకు వేలాది మంది తరలివచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అయినా ఇప్పటికీ పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వేలాదిమంది పొరుగు సేవల ఉద్యోగులు విజయవాడ వేదికగా గళమెత్తారు. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 2 లక్షల 50వేల మంది వరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుండగా 98 వేలమందినే ఆప్కాస్ లోకి తీసుకున్నారు. మిగతావారిని విస్మరించారు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై మాట తప్పిన వైసీపీ సర్కార్
Contract Employees Agitation at Vijayawada: ప్రధానంగా ఆర్టీసీ, అటవీ శాఖ, నీటిపారుదల లస్కర్లు, గురుకులాలు, మోడల్ స్కూళ్లలో పనిచేసే సిబ్బందిని ప్రభుత్వం ఆప్కాస్‌లోకి చేర్చుకోలేదు. దీనివల్ల వీరంతా పాత తరహాలోనే జీతాల కోసం నెలల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేరుకు ఉద్యోగం చేస్తున్నప్పటికీ జీతాలు మాత్రం సక్రమంగారాక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుకున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమాన గంటలు పనిచేస్తున్నా ఇంక్రిమెంట్లు, పీఆర్సీ వంటివి దక్కడం లేదని వాపోయారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సీఎఫ్‌ఎమ్‌ఎస్‌లో నమోదు కావడంతో వారికి సంక్షేమ పథకాలు అందడం లేదు. అనారోగ్యం వస్తే మెడికల్ లీవులు వర్తించవు. ఎవరైనా పొరుగు సేవల ఉద్యోగులు మరణిస్తే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనేది డిమాండ్‌గానే మిగిలింది. మెప్మా, సెర్ప్ ఉద్యోగులకు గత ప్రభుత్వం హెచ్ఆర్ పాలసీని అమలు చేయగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం వర్తింపజేయాలని కోరుతున్నారు.
AP Outsourcing Employees Demands: పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమపై కనికరం చూపి డిమాండ్లను పరిష్కరించాలని పొరుగు సేవల ఉద్యోగులు కోరుతున్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు దృష్టిలో పెట్టుకుని మినిమం టైం స్కేలు, ఇతర డిమాండ్లను అమలు చేయాలని వేడుకున్నారు.
"చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ భారంగా మారింది. పేరుకు ఉద్యోగం చేస్తున్నప్పటికి జీతాలు మాత్రం సక్రమంగారాక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. రెగ్యులర్ ఉద్యోగులతో సమాన గంటలు పనిచేస్తున్నా ఇంక్రిమెంట్లు, పీఆర్సీ వంటివి దక్కడం లేదు. మా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని పెరుగుతున్న నిత్యావసర ధరలు దృష్టిలో పెట్టుకుని మినిమం టైం స్కేలు, ఇతర డిమాండ్లను అమలు చేయాలని కోరుతున్నాం." - ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన