TDP leader Kollu Ravindra: జగన్‌కు బాబాయ్ హంతకులను కాపాడటంలో ఉన్న శ్రద్ద ఈ రాష్ట్ర ప్రజల మీద లేదని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మండిపడ్డారు. బాబాయ్ హంతకులను కాపాడేందుకే జగన్ విశాఖ రాజధాని అని సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని తెరమీదకు తెచ్చారని కొల్లు ఆరోపించారు. సీఎం జగన్ డైవర్ట్ పాలిటిక్స్‌కు తెర లేపాడని దుయ్యబట్టారు. లిక్కర్ స్కాములో భార్య పేరు బయటకు రాగానే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేర్చు తెరమీదకు తెచ్చాడన్నారు. నాడు రాజధానికి ౩౦ వేలు ఎకరాలు కావాలన్నావు,.. ఇల్లు ఇక్కడే కట్టాను అన్నావు, ఇప్పడు రాజధాని విశాఖ అంటున్నావు.. ఇది మోసం కాదా జగన్ రెడ్డి అంటూ కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.
జగన్ రెడ్డి ఇంకా రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనే చూస్తున్నాడన్నారు. బాబాయ్ హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచగానే జగన్ రెడ్డి పరిగెత్తుకుంటూ వెళ్లి ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడైనా ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపాడా అని నిలదీశారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాడన్నారు. తమ ప్రాణాలను అడ్డు వేసైనా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడుతామని తెలిపారు. తమ విధానం రాష్ట్రం అభివృద్ధి చెందడం, అన్ని ప్రాంతాలు ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా చూడటమని స్పష్టం చేశారు. జగన్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజా క్షత్రంలో ఎదుర్కొంటాము, ప్రజాస్వామ్య బద్దంగా బుద్ధి చెబుతామని కొల్లు రవీంద్ర అన్నారు.
ప్రజల మధ్య చిచ్చు: రాజధానుల పేరుతో జగన్ ప్రజల మధ్య చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారని.. బీజేపీ నేత టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులోని వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. జగన్ మరోసారి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీమ ప్రజలకు అమరావతే దూరం అవుతుంటే... విశాఖ మరింత దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రాయలసీమలో శీతాకాల రాజధాని ఏర్పాటు చేయాలని కోరామని గుర్తు చేశారు. కర్నూలులో హైకోర్టు పెడతామని చెప్పిన జగన్.. దాని గురించి ఏమీ మాట్లాడకపోవటం విడ్డూరమని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రం ముక్కలయ్యే ప్రమాదం ఉందని టీజీ వెంకటేష్ వివరించారు.
రాజధానిపై జగన్: మార్చిలో విశాఖలో నిర్వహించనున్న అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సదస్సుకు రావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. దిల్లీలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సన్నాహక సమావేశంలో మాట్లాడిన జగన్ కొద్దిరోజుల్లోనే విశాఖ రాష్ట్ర రాజధాని కాబోతుందని అన్నారు. ఏపీకి రాజధాని కాబోతున్న విశాఖకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. నేనూ కొద్ది నెలల్లోనే విశాఖకు తరలివెళ్తున్నా. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు రావాలని ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నట్లు జగన్ తెలిపారు.
ఇవీ చదవండి: