NTR's image on one hundred rupee silver coin: నందమూరి తారక రామారావు తెలుగు ఆత్మ గౌరవానికి ప్రతీక.. ఆయన రూపం సమ్మోహనం, సుమనోహరం, అభినయ వేదం, ఆయన నటనకు విశ్వవిద్యాలయం.. తెలుగువారి ఖ్యాతిని విశ్వమంతా ఎలుగెత్తి చాటిన జాతిరత్నం.. తెలుగుజాతికి ఐక్యతా చిహ్నం.. వెండితెరవేల్పు, మేలుకొలుపు, ప్రేక్షకుల ప్రపంచానికి ఆయన ఓ ఆరాధ్యదైవం, తెలుగు సినీ వజ్రోత్సవ చరిత్రలో ఆయనో సువర్ణాధ్యాయం, సాంఘికం, పౌరాణికం, చారిత్రకం, జానపదం.. ఏదైనా ఆయనకు నటనే ప్రాణప్రదం.
ఆకర్షించే ఆహార్యం.. ఆకట్టుకునే అభినయం.. అలరించే గళం.. వెరసి తెలుగు సినిమాకు ఆయన ఓ వరం. నటనతో పాటు రాజకీయంలోనూ కొత్త చరిత్ర సృష్టించిన వ్యక్తి నందమూరి తారక రామారావు. అలాంటి వ్యక్తి పేరిట నాణెం ముద్రణ చేయడం తెలుగు ఖ్యాతిని మరింత పెంచడమే. ఎంతో మందికి ఆదర్శవంతుడై ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన నందమూరి ఎందరికో చూపించాడు దారి.
ఈ నేపథ్యంలో తెదేపా వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల వేళ తెలుగు ప్రజలకు కేెంద్రం తీపి కబురు చెప్పింది. ఎన్టీఆర్ బొమ్మతో 100 రూపాయల వెండి నాణెం ముద్రణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ కూతురు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని కలిసిన మింట్ అధికారులు ఆమె నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఐదారు మాసాల కిందట ఎన్టీఆర్ పేరిట నాణెం తీసుకురావాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ దృష్టికి తీసుకెళ్లానని పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజరైన కేంద్ర మంత్రి వ్యక్తిగతంగా చొరవ తీసుకున్న నేపథ్యంలో మింట్ నుంచి అప్రూవల్ వచ్చిన దృష్ట్యా కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. నాణెం ముద్రణ కోసం ఎన్టీఆర్ నేపథ్యం స్వీకరించిన మింట్ అధికారులు 3 ఫోటోలు పరిశీలించారని చెప్పారు.
ప్రొసీజర్ అంతా నెల రోజులు పడుతుందని, ఆ తర్వాత మరో నెల రోజుల్లో ఎన్టీఆర్ బొమ్మతో 100 రూపాయల వెండి నాణెం విడుదలవుతుందని వెల్లడించారు. నాన్న ఆశీర్వాదం వల్లే ఇది సాధ్యమైందని, ఇదొక అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తెలుగు జాతి రత్నంగా కోట్లాది మంది గుండెల్లో దేవుడుగా పూజింపబడుతున్న ఎన్టీఆర్ గొప్పతనం, సమున్నత సేవలు దృష్ట్యా భవిష్యత్తులో భారతరత్న కూడా లభించవచ్చని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి :