Nara lokesh and TDP Leaders Met AP Governor : వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు, చేస్తోన్న సామాజిక అన్యాయంపై తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Justice Abdul Nazeer)కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో గత 53 నెలల వైఎస్సార్సీపీ ప్రభుత్వ అరాచక పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగాయంటూ గవర్నర్‌కు లోకేశ్ వివరించారు.
Lokesh Complaint to Justice Abdul Nazeer on Shyam Kumar Issue : బీసీ వర్గానికి చెందిన అమర్నాథ్ గౌడ్ నోట్లో పేపర్లు కుక్కి, పెట్రోల్ పోసి వైఎస్సార్సీపీ నేతలు తగలబెట్టారన్నారు. దళిత వర్గానికి చెందిన శ్యామ్‌కుమార్‌పై దాడి చేసి మూత్రం పోసిన ఘటననూ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి గవర్నర్‌కు వివరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్షాలపై జగన్ ప్రభుత్వం సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలను గవర్నర్‌కు నేతలు నివేదించారు. వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
Cases on TDP Chief Nara Chandrababu Naidu : యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) మొదలైన రోజు నుండి అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు, వైఎస్సార్సీపీ నాయకులు చేసిన దాడులకు సంబంధించిన ఆధారాలను లోకేశ్ గవర్నర్‌కు అందజేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదన్న లక్ష్యంతో జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసుల గురించి ఆధారాలతో సహా గవర్నర్‌కి నేతలు వివరించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్, ఇసుక విధానం, లిక్కర్ పాలసీ అంటూ కేసుపై కేసు నమోదు చేసి ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్న సర్కారు కక్ష సాధింపులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. జైలులోనే చంద్రబాబు చస్తాడంటూ వైసీపీ ఎంపీ మాధవ్ అన్న మాటలను లోకేశ్ గవర్నర్ వద్ద ప్రస్తావించారు.
ఆర్టికల్ 355 ప్రకారం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి : ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు అడ్డుకట్ట వేసేలా రూపొందించిన 17ఏ సెక్షన్‌ను సైతం తుంగలో తొక్కి.. గవర్నర్ వ్యవస్థను కూడా గౌరవించకుండా జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును నేతలు వివరించారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబును 53 రోజుల పాటు జైలులో నిర్బంధించిన విధానాన్ని లోకేశ్, అచ్చెన్నాయుడు తదితరులు గవర్నర్‌కు నివేదించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు చెక్ పెట్టేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 ప్రకారం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టీడీపీ నేతల బృందం ఆయనకు విజ్ఞప్తి చేసింది.
వైసీపీ నాయకుల ఇసుక దోపిడీని ప్రజలకు వివరిస్తున్నారనే చంద్రబాబుపై అక్రమ కేసులు: టీడీపీ నేతలు
Telugu Desam Leaders Complaint to Governor On YSRCP Government : నారా లోకేశ్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, పీతల సుజాతతో పాటు నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, అశోక్‌బాబు తదితరులు విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు.
టీడీపీ కార్యకర్తలపై 60 వేల కేసులు : నారా లోకేశ్, టీడీపీ నేతలు గవర్నర్‌ని కలిసిన అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై జగన్‌కు నరనరానా కక్ష సాధింపే ఉందని ఆరోపించారు. టీడీపీ సానుభూతిపరులపై 60 వేల కేసులు పెట్టారన్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో పోలీసుల తీరును గవర్నర్‌కు తెలిపామని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చంద్రబాబుపై ఆధారాలు లేకుండా కేసులు పెట్టారని ఆరోపించారు. వైసీపీ పాలనలో దక్షిణ భారతదేశ బిహార్‌గా ఏపీ మారిందని ఆయన విమర్శించారు.
దొంగ ఓట్ల గురించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం : రాష్ట్రంలో దొంగ ఓట్లపై పోరాటం కొనసాగిస్తాం నారా లోకేశ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పేరుపైనా దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల సంఘాన్ని కలుస్తామని.. 6 అంశాలపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
త్వరలో మేనిఫెస్టో విడుదల : ప్రజా సమస్యలపై జనసేనతో కలిసి ప్రజా ఉద్యమం చేపడతామని అన్నారు. కరవుతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, తాగునీటి సమస్య ఉందని అన్నారు. జనసేనతో సంప్రదింపులు జరిపారని, త్వరలో మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించారు.