A bitter experience for YSRCP MLA Jagan Mohan Rao: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఓట్లు వేసి గెలిపించినందుకు రాష్ట్ర అభివృద్దికి, ప్రజలకు ఏ మేలు చేస్తున్నారో చెప్పాలంటూ పలు జిల్లాల్లోని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ చందర్లపాడు మండలం కొడవటికల్లు గ్రామంలో నందిగామ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావుకు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. 'మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏదో చెప్పండి ఎమ్మెల్యేగారూ..' అంటూ ఓ గ్రామస్థుడు ఎమ్మెల్యేను నిలదీశాడు. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది.
ఎమ్మెల్యే జగన్ మోహన్ రావుకు చేదు అనుభవం.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ చందర్లపాడు మండలం కొడవటికల్లు గ్రామంలో 'మన రాజధాని ఏది అంటూ' నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావును ఓ స్థానికుడు నిలదీశాడు. కొడవటికల్లు గ్రామంలో ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పర్యటించారు. దీనిలో భాగంగా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో 'మన రాజధాని ఏది అంటూ' ఎమ్మెల్యే అని ప్రశ్నించారు.
మన రాష్ట్ర రాజధానులు మూడు..! ఆ ప్రశ్నకు ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు స్పందిస్తూ.. ప్రతిపాదిత మూడు రాజధానులు అంటూ సమాధానమిచ్చారు. అవి ఏంటి అని తిరిగి ఎమ్మెల్యేనే ఆ గ్రామస్థుడు తిరిగి ప్రశ్నించాడు. దానికిి ఎమ్మెల్యే 'నీకు తెలియదా అంటూ' మళ్లీ ఎదురు ప్రశ్నించారు.. తెలియదని చెప్పగా.. తెలియకపోతే వదిలేయ్ అంటూ ఎమ్మెల్యే సమాధానం చెప్పడానికి నిరాకరించారు.
నేను ఎమ్మెల్యేని ఎక్కడికైనా వస్తా..! అనంతరం సుబాబులకు 5000 మద్దతు ధర ఇప్పిస్తానని పాదయాత్రలు చేశారు కదా.. మరీ ఇప్పుడు ధర లేదని స్థానికుడు ప్రశ్నించాడు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆ పసుపు పార్టీ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. వెంటనే ఆ స్థానికుడు మాట్లాడుతూ.. మీరు మద్దతు ధర ఇస్తానని ఓట్లు వేయించుకున్నారుగా అని ప్రశ్నించారు. 'నువ్వు ఓటు వేశావా' అంటూ ఎమ్మెల్యే ఎదురు ప్రశ్నించాడు. ఓట్లు వేయకపోతే తమ ఇంటికి ఎందుకు వచ్చారని తిరిగి స్థానికుడు ఎదురు ప్రశ్నించాడు. 'నేను ఎక్కడికైనా వస్తా' అంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'అలా అయితే నువ్వు మా దగ్గరకు రావద్దు' అంటూ స్థానికుడు ఎమ్మెల్యేకు చెప్పటంతో అయితే తమకు అవసరం లేదంటూ.. రావాల్సిన అవసరం లేదంటూ ఎమ్మెల్యే అసహనంతో బయటికి వెళ్లిపోయాడు.
ఇవీ చదవండి