Nandigama TDP Candidate Tangirala Sowmya : ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థినిగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. గురువారం ఎన్టీఆర్ జిల్లా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నందిగామ నియోజకవర్గ పార్టీ నాయకులతో చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఆయన మాట్లాడారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు నందిగామలో జరిగిన రెండు ఎన్నికల్లో మినహా.. మిగిలిన వాటిల్లో విజయం సాధించామని ఆయన చెప్పారు. పార్టీ పటిష్ఠంగా ఉందని అందరు కలిసికట్టుగా పని చేయాలని పార్టీ నాయకులను ఆదేశించారు. నందిగామలో విజయం ఖాయమని భారీ మెజార్టీతో గెలుపు సాధించాలని కోరారు. దీని కోసం కష్టపడి పని చేయాలని వారికి సూచించారు.
మాజీ ఎమ్మెల్యే దివంగత తంగిరాల ప్రభాకరరావు పార్టీ కోసం అంకిత భావంతో పని చేశారని గుర్తు చేశారు. అదే విధంగా సౌమ్య కూడా సేవలందిస్తున్నారన్నారని అన్నారు. అందుకే మరోక సారి అభ్యర్థినిగా అవకాశం ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంలో సౌమ్య భావోద్యోగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకరరావు రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక 2014లో గుండెపోటుతో మృతి చెందారు.
అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో రెండోసారి పోటీ చేసి ఓడిమి పాలయ్యారు. నియోజకవర్గంలో సౌమ్యురాలిగా గుర్తింపు ఉన్న సౌమ్యకు మరోసారి చంద్రబాబు అవకాశం కల్పించారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు, నాయకులు కోట వీరబాబు, కోగంటి బాబు, వాసిరెడ్డి ప్రసాదు, వీరంకి వీరాస్వామి, యేచూరి రామకృష్ణ, షేక్ కరీముల్లా, వేల్పుల బిక్షాలు, మన్నే సాత్విక, మేకల సుధాకర్, కాసర్ల లక్ష్మీనారాయణ, షేక్ ఖాజా, నెలకుదటి నాగేశ్వరరావు, వసంత సత్యనారాయణ, రామకృష్ణ, యండ్రపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
- Meda VijayasekharReddy Meet CBN: చంద్రబాబు ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా: మేడా విజయశేఖర్ రెడ్డి
గెలుపు ఖాయం : నారా చంద్రబాబు నాయుడు నందిగామ అభ్యర్థిగా తంగిరాల సౌమ్యను ప్రకటించడంతో ఆమె ఇంటి వద్ద పండగ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే సౌమ్య ఇంటి వద్ద బాణాసంచా కాల్చి సందడి చేశారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యేకి శాలువాలు కల్పి సత్కరించారు. నందిగామలో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని సౌమ్య తెలిపారు. తనపై నమ్మకంతో మళ్లీ నందిగామ సీటు కేటాయించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరిని సమన్వయం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో విజయవంతంగా పని చేస్తానని స్పష్టం చేశారు. నందిగామ నియోజకవర్గానికి చెందిన నాయకులు ఆమెను కలిసి అభినందనలు తెలిపారు. తంగిరాల సౌమ్య అభ్యర్థిత్వం పట్ల పార్టీ నాయకులు పూర్తి మద్దతును తెలిపారు. దీంతో నందిగామలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.