MP Kesineni Nani on Resignation: ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో ముస్లింల స్మశాన వాటిక ప్రహరీ గోడను వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్‌రావుతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా తన రాజీనామా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ స్పీకర్ అపాయింట్‌మెంట్ కోరానని, రాజీనామా లేఖ సమర్పిస్తానని తెలిపారు. తనను నమ్ముకుని ఉన్న ఎంతోమంది అభిమానులు, కార్యకర్తలతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటానని కేశినేని నాని అన్నారు.
PVP Comments on Kesineni Nani: ఎంపీ కేశినేని నాని రాజీనామా అంశంపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (PVP) తీవ్ర విమర్శలు చేశారు. కేశినేని నాని బెజవాడకే గుదిబండలా తయారయ్యారని మండిపడ్డారు. తెలుగుదేశం పుణ్యమా అని పదేళ్లు బండి కొనసాగించారన్నారు. బ్యాంకులను బాది, జనాలని, ఉద్యోగులని పీల్చి పిప్పి చేశారని దుయ్యబట్టారు. ఇకనైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి ఓ మూలన ఉండాలని పొట్లూరి వరప్రసాద్ హితవుపలికారు. కాగా గత ఎన్నికల్లో కేశినేని నానిపై వైసీపీ తరఫున పీవీపీ పోటీ చేశారు.
ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేయనున్నానని కేశినేని నాని ప్రకటన
ఎంపీ కేశినేని నాని కామెంట్స్: లోక్‌సభ స్పీకర్ అపాయింట్మెంట్ కోరానన్న నాని, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పిస్తానని తెలిపారు. ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా చేశానని, అయితే మూడోసారి చేసినా, నాలుగో సారీ చేసినా చివరికి ఎదో ఒక రోజు మాజీ ఎంపీ అవ్వాల్సిందే అని ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నర ఏళ్ల క్రితం తన వాళ్లందరికీ చెప్పానని, ఈ సారి తర్వాత విరామం తీసుకుంటానని తన సహచరులకు చెప్పానన్నారు. పార్టీని, చంద్రబాబు నిర్ణయాలను తప్పు పట్టడం లేదని, కొన్నిసారు ఇలాంటి నిర్ణయాలు జరుగుతుంటాయని పేర్కొన్నారు. తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. స్పీకర్ కలిసిన తర్వాత అదే రోజున రాజీనామాను ఆమోదింపచేసుకుంటానని చెప్పారు.
టికెట్ ఇవ్వకపోయినా అధినేత ఆదేశాలు తప్పకుండా పాటిస్తా: టీడీపీ ఎంపీ కేశినేని నాని
తాను ఏది చేసినా కూడా పారదర్శకంగా చేస్తుంటానన్న కేశినేని, ఏదైనా నిర్ణయం తీసుకున్నా తెల్లారేసరికి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని తెలిపారు. తనను నమ్ముకొని ఎంతోమంది అభిమానులు ఉన్నారని, వారందరితో మాట్లాడిన తర్వాతే భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. ముందుగా తన ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఆమోదింపచేసుకున్న తర్వాతనే పార్టీకి రాజీనామా చేస్తానని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు.
నందిగామ వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ బాగా పనిచేస్తున్నారంటూ ఎంపీ కేశినాని కితాబిచ్చారు. ప్రజల కోసం ఎమ్మెల్యే నిరంతరం పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు తన డాక్టర్ ప్రాక్టీస్‌ను వదిలేసి మరీ ప్రజా సేవ చేస్తున్నారని, ఆయన డాక్టర్ వృత్తిలో ఉంటే కరోనా సమయంలో 100 తరాలకు సరిపడే డబ్బులు సంపాదించుకునే వారని పేర్కొన్నారు.