Agriculture Statistics 2021 Report: వ్యవసాయ సేవల రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వెనుకబడింది. ఈ పెట్టుబడులతో వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధికి ఊతం లభించి, రైతులకు మరిన్ని మౌలిక సదుపాయాలు ఒనగూరుతాయి. భారత వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ అంశాల వివరాలతో ‘వ్యవసాయ గణాంకాలు-2021’ నివేదికను కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా విడుదల చేసింది.
2019 అక్టోబరు నుంచి 2021 సెప్టెంబరు మధ్యకాలంలో 17 రాష్ట్రాలకు 187.85 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో తెలంగాణకు అత్యధికంగా 49.44 మిలియన్ డాలర్లు, బిహార్‌కు 39.5, గుజరాత్‌కు 30.49, తమిళనాడుకు 20.07 మిలియన్ డాలర్లు అందాయి. చివరి మూడు స్థానాల్లో ఏపీ(0.12 మిలియన్ డాలర్లు), రాజస్థాన్(0.11), ఒడిశా(0.01) నిలిచాయి. బిహార్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల వ్యవసాయరంగాలకు సైతం ఏపీకంటే ఎక్కువ పెట్టుబడులు రావడం గమనార్హం.
ఏపీలో 29.43 లక్షల రైతు కుటుంబాలకు అప్పులు: కేంద్రం నివేదిక ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని 29.43 లక్షల రైతు కుటుంబాలకు, తెలంగాణలోని 24.36 లక్షల రైతు కుటుంబాలకు అప్పులు ఉన్నాయి. దేశంలో మొత్తం 4.67 కోట్ల రైతు కుటుంబాలకు అప్పులున్నాయి. దేశంలో 2020-21లో పండిన మొత్తం ఆహారధాన్యాల్లో ఏపీ వాటా 3.7 శాతమైతే... దేశవ్యాప్తంగా అప్పుల్లో ఉన్న రైతు కుటుంబాల్లో ఏపీ వాటా 6.3 శాతం. తెలంగాణ ఆహారధాన్యాల వాటా 3.3 శాతమైతే అప్పుల్లో ఉన్న రైతు కుటుంబాలది 5.2 శాతంగా తేలింది.
ఏపీలో క్వింటా ధాన్యం ఉత్పత్తికి రూ.1005 ఖర్చు: ఒక క్వింటా ధాన్యం ఉత్పత్తికి అత్యధికంగా మహారాష్ట్రలో రూ.2,405, పశ్చిమబెంగాల్లో రూ.1,584, కేరళలో రూ.1,560 ఖర్చవుతోంది. అది తెలంగాణలో రూ.1,319, ఏపీలో రూ.1,005గా ఉంది. క్వింటా జొన్నల ఉత్పత్తికి తెలంగాణలో రూ.2,925, ఏపీలో రూ.1,290 ఖర్చు అవుతోంది. మొక్కజొన్నకు తెలంగాణలో రూ.930, ఏపీలో రూ.1330 అవుతోంది.
* గోదాముల్లో నిల్వ సామర్థ్యం 2021 మార్చినాటికి ఏపీలో 33.52 లక్షల టన్నులుంటే తెలంగాణలో 17.09 లక్షల టన్నులుంది. అత్యధికంగా పంజాబ్‌లో 226.18 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యముంది. శీతల గిడ్డంగుల్లో నిల్వ సామర్థ్యం ఏపీ, తెలంగాణ కలిపి 2022 జనవరి ఆఖరుకు 16.97 లక్షల టన్నులుంది.
* భూసార పరీక్షలు చేసి రైతులకు ఇచ్చిన భూసార ఫలితాల కార్డులు 2019-20లో ఏపీలో 2.26 లక్షలుంటే తెలంగాణలో 1.10 లక్షలున్నాయి. అత్యధికంగా యూపీలో 2.55 లక్షల కార్డులిచ్చారు.
* పంటల సాగుకు బ్యాంకులిచ్చిన పంట రుణాల సొమ్ము 2021-22లో తెలంగాణలో 18.74 లక్షల మంది రైతులకు రూ.23,037 కోట్లు. ఏపీలో 38.77 లక్షల మంది రైతులకు రూ.52,098 కోట్లున్నాయి.
* తెలంగాణలో 2020 నాటికి రైతులకు 42.39 లక్షలు, ఏపీలో 48.55 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులున్నాయి.
దేశవ్యాప్తంగా ఇదీ ఆహార ధాన్యాల లభ్యత తీరు: దేశ ప్రజలకు తలసరి ఆహార ధాన్యాల లభ్యత తగ్గుతోంది. 1951లో తలసరి ఆహార ధాన్యాల లభ్యత ఏడాదికి 144 కిలోలుంటే 2021నాటికి 185.4కి పెరిగింది. అత్యధికంగా.. 1991లో తలసరి లభ్యత 186.2 కిలోలుండగా ఇప్పుడు అంతకన్నా 800 గ్రాములు తగ్గడం గమనార్హం.
* వార్షిక తలసరి బియ్యం లభ్యత 1951లో 58 కిలోలు, పప్పులు 22.1 కిలోలుగా ఉంటే 2021లో బియ్యం 71.9, పప్పులు 16.4కి తగ్గాయి.
* పప్పుల వార్షిక తలసరి లభ్యత 1955లో 25.7 కిలోలుండగా ఇప్పుడు 16.3 కిలోలు. పేదలకు పోషకాహారం అందాలంటే పప్పులు ముఖ్యం. అవి లేనందునే దేశప్రజల్లో పోషకాహార లేమి పెరుగుతోంది.
* వంటనూనెల తలసరి వినియోగం 1960-61లో 3.2 కిలోల నుంచి 2020-21కు 19.7 కిలోలకు, ఇదే కాలవ్యవధిలో టీ పొడి వినియోగం 296 కిలోల నుంచి 863 కిలోలకు, కాఫీ పొడి వినియోగం 80 గ్రాముల నుంచి 100 గ్రాములకు పెరిగింది.
* బియ్యం వినియోగం గ్రామాల్లో ఎక్కువగా ఉంది. 2011-12లో గ్రామాల్లో ఏడాదికి 74.56 కిలోల బియ్యం వినియోగమైతే పట్టణాల్లో 54.02 కిలోలుంది. అదే ఏడాది కూరగాయల వార్షిక తలసరి జాతీయ సగటు వినియోగం 52.61 కిలోలుగా ఉంది.
* ఆహార ధాన్యాలపై కేంద్రం ఇస్తున్న రాయితీ 2009-10లో రూ.58,200 కోట్లు ఉంటే 2021-22లో రూ.1,94,100 కోట్లకు పెరిగింది.
ఇవీ చదవండి