Minister Botsa Satyanarayana: విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో ఉపాధ్యాయులు పదోన్నతులు, సబ్జెక్ట్ ఉపాధ్యాయుల నియామకంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... బదిలీలు కావాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని అడిగారని అందుకోసమే బదిలీలకు సంబంధించి జీవో ఇవ్వడం జరిగిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
మూడవ తరగతి నుంచి విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని బొత్స వెల్లడించారు. ఇందుకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 వేలమంది సబ్జెక్టు టీచర్స్ అవసరమని గుర్తించామని మంత్రి పేర్కొన్నారు. కొంతమంది ఉపాధ్యాయ సంఘాల నేతలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వ జీవోపై న్యాయస్థానానికి వెళ్లారని బొత్స ఆరోపించారు. ఉపాధ్యాయులకు బదిలీల్లో ఇబ్బంది లేకుండా రూ.2500 అలవెన్స్లు సైతం ఇస్తున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
గవర్నర్ను కలవడంపై బొత్స: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు గవర్నర్ను కలవడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉందని, అన్యాయం జరిగిందని అనుకుంటే ఎవరైనా ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆర్ధిక సంబంధమైన అంశాలను తమ వద్ద ప్రస్తావిస్తే తప్పకుండా చర్చించే వాళ్లమని తెలిపారు. సూర్యనారాయణ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ఉపాధ్యాయ సంఘాల నేతలు: సబ్జెక్ట్ ఉపాధ్యాయుల నియామకంలో కొంత గందరగోళ పరిస్థితులు తలెత్తాయని ఉపాధ్యాయ సంఘ నేతలు అభిప్రాయపడ్డారు. మంత్రి బొత్సతో జరిగిన సమావేశం అనంతరం ఎస్.టి.యూ రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్, ఎపీటిఎఫ్ ప్రధాన కార్యదర్శి చిరంజీవి మాట్లాడారు. ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీలు, పదోన్నతుల విషయంలో న్యాయస్థానం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత అమలు చేస్తామని ప్రభుత్వ హమీ ఇచ్చిందన్నారు. 70 శాతం ఖాళీలు పదోన్నతి ద్వారా, డీఎస్సీ ద్వారా 30 శాతం ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందన్నారు. సబెక్ట్ ఉపాధ్యాయులను నియమించాలన్న ప్రభుత్వ ఆలోచన ప్రకారం న్యాయస్థాన నిబంధనలకు అనుగుణంగా సర్దుబాటు చేయడం జరిగిందనన్నారు. ప్రభుత్వ ఆలోచన అర్థం కాని ఉపాధ్యాయులు అన్విల్లింగ్ చెప్పారని.. వారికి ప్రభుత్వం మరొకసారి అవకాశం కల్పించాలన్నారు.
ఇవీ చదవండి: