Manneguda Kidnapping Case Updates : అమెరికా సంబంధం రావడంతో హైదరాబాద్ మన్నెగూడకు చెందిన దంత వైద్యురాలికి.. ఈ నెల 9న తల్లిదండ్రులు నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి యువతిని అపహరించి పెళ్లి చేసుకోవాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం అనుచరులతో పాటు తన ప్రాంఛైజీ స్టాళ్లలో పని చేసే 50 మందిని అమ్మాయి ఇంటికి తీసుకొచ్చి దాడికి పాల్పడ్డాడు. ఇంట్లోని సామగ్రితో పాటు ఐదు కార్లను ధ్వంసం చేయడమే కాకుండా అడ్డుకోబోయిన యువతి తల్లిదండ్రులు సహా మరో ఇద్దరిపై దాడికి పాల్పడ్డారు.
ఆ తర్వాత ఆమెను బలవంతంగా అపహరించి తీసుకెళ్లాడు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు నవీన్ రెడ్డి.. మిత్రుల సహకారంతో యువతిని సురక్షితంగా కుటుంబసభ్యులకు అప్పగించారు. మరుసటి రోజు 32 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 11న శంషాబాద్ పరిసరాల్లో నిందితుడి వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చందు, ప్రవీణ్, ప్రకాష్, మహేశ్, యశ్వంత్‌ను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని జప్తు చేశారు. అయితే ప్రధాన నిందితుడు ఎక్కడ ఉన్నాడనేది పోలీసులకు సవాల్‌గా మారింది. అతడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
తానే బాధితుడినంటూ ఆవేదన: మంగళవారం సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల ద్వారా నవీన్ రెడ్డి మీడియాకు చేరవేశాడు. తానే బాధితుడినంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 6 రోజులుగా ఇతడి ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా గోవాలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపరిచారు.
14 రోజుల రిమాండ్: న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే నవీన్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చే సమయంలో 58 నిమిషాల వీడియో విడుదల చేస్తే.. అందులో రెండు నిమిషాలే పోలీసులు మీడియాకు విడుదల చేశారని నవీన్‌రెడ్డి ఆరోపించాడు. భయం వేస్తోందంటూ కన్నీరు పెట్టుకున్నాడు. గతంలో నవీన్ రెడ్డిపై వరంగల్, విశాఖపట్నం, ఆదిభట్లలో నమోదైన వాటితో కలిపి 4 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని కస్టడీకి తీసుకొని విచారించేందుకు కోర్టులో నేడు పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. పరారీలో ఉన్న రుమన్, పవన్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టు పోలీసులు వివరించారు.
ఇవీ చదవండి:
దంత వైద్యురాలి అపహరణ కేసు.. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు