Justice Praveen Kumar's Felicitation Ceremony: జస్టిస్ ప్రవీణ్ కుమార్ పదవీ విరమణ చేయటం న్యాయశాఖకు తీరని లోటని ఐఏఎల్ రాష్ట్ర కార్యదర్శి చలసాని అజయ్ అన్నారు. అమరావతికి హైకోర్టును తీసుకురావటంలో జస్టిస్ ప్రవీణ్ కుమార్ కీలకపాత్ర పోషించారన్నారు. జస్టిస్ ప్రవీణ్ కుమార్ న్యాయవ్యవస్థలో తనదైన ముద్ర వేసుకున్నారని, సుస్థిరమైన పేరు తెచ్చుకున్నారని హైకోర్టు న్యాయమూర్తులు, భారత న్యాయవాదుల సంఘం నిర్వాహకులు కొనియాడారు. అలాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకోవాలని న్యాయమూర్తులు, న్యాయవాదులను కోరారు.
ఘనంగా సన్మానం: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల పదవీ విరమణ చేసిన సందర్భంగా జస్టిస్ ప్రవీణ్ కుమార్, సుష్మితరెడ్డి దంపతులను ఐఏఎల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. విజయవాడలోని శేషసాయి కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి విజయవంతమైన న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ఉన్నత స్థానాన్ని చేరుకుంటారనేందుకు జస్టిస్ ప్రవీణ్‌కుమార్ నిదర్శనమని బార్ కౌన్సిల్ ఛైర్మన్ అన్నారు.
అందరితో సమానంగా: జస్టిస్ ప్రవీణ్ కుమార్లో నీతి, నిబద్ధత, నిజాయతీ, సామాజిక స్పృహ ఇలా ప్రతీది.. ఆయన నడవడికలో ఉన్నాయని అన్నారు. రిటైర్ అయ్యేంతవరకూ కూడా చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరితోనూ సమానంగా వ్యవహరించారని జస్టిస్ ప్రవీణ్ కుమార్‌ని పలువురు ప్రశంసించారు.
సాధారణ జీవితం: సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి, జస్టిస్ ప్రవీణ్‌కుమార్ సాధారణ జీవితం గడిపారన్నారు. కష్టించి పనిచేసి ఉన్నత శిఖరాలను అధిరోహించారని కొనియాడారు. యువ న్యాయవాదులు వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. చాలా కష్టపడి పోయామని, ఫలితం దక్కలేదని ప్రస్తుత రోజుల్లో యువ న్యాయవాదులు నిరుత్సాహపడుతున్నారన్నారు. తక్షణమే ఆదాయం రావాలి అనే ఆలోచన విధానంలో మార్పు రావాలన్నారు. జస్టిస్ ప్రవీణ్ కుమార్ తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నారని ప్రశంసించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కోర్టును శాంతియుత వాతావరణంలో నిర్వహించారని కొనియాడారు. అంశం ఏదైనా విచారణ జరిపి ఆదర్శ న్యాయమూర్తిగా పేరు తెచ్చుకున్నారన్నారు.
తండ్రితో వెళ్లాను: ఐఏఎల్ నిర్వహించే కార్యక్రమాలకు తండ్రి పద్మనాభ రెడ్డితో వివిధ ప్రాంతాలకు వెళ్లానని జస్టిస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. న్యాయవాదులను కలవడానికి, స్థానిక సమస్యలు తెలుసుకోవడానికి అవకాశం కలిగిందన్నారు. ఉమ్మడి హైకోర్టు విభజన జరిగి విజయవాడలో కొత్తగా హైకోర్టు ఏర్పాటు చేసే సమయంలో ఎదురైన సమస్యలు అధిగమించిన తీరును గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి న్యాయవాదులు హాజరయ్యారు. ఐఏఎల్ ఆధ్వర్యంలో జస్టిస్ ప్రవీణ్‌కుమార్ దంపతులను ఘనంగా సన్మానించారు.
"జస్టిస్ ప్రవీణ్ కుమారు గారు.. గత నెల 26న రిటైర్ అవ్వడం జరిగింది. ఈయన హైకోర్టును అమరావతిలో ఏర్పరచడంలో ప్రముఖపాత్ర పోషించారు. తరువాత యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా కూడా అనేక ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించారు". - చలసాని అజయ్ ,ఐఏఎల్ రాష్ట్ర కార్యదర్శి
ఇవీ చదవండి: