Immensely Talented Young Girl: చిన్ననాడే క్రీడలపై ఆసక్తి పెంచుకుందీ అమ్మాయి. పాఠశాల రోజుల్లోనే టెన్నిస్ బ్యాట్ పట్టి.. అనతికాలంలోనే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటింది. ప్రతిభను చూసి ముగ్దులైన టీచర్లు, తల్లిదండ్రులు వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఫలితంగా ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో దేశం తరఫున పాల్గొని ప్రతిభ కనబరిచిందీ యువ క్రీడాకారిణి.
ఆసియా గేమ్స్‌లో పాల్గొని దేశ ఖ్యాతి ఇనుమడింపజేసిన సాఫ్ట్ టెన్నిస్ క్రీడాకారిణి పేరు నేలకుదిటి అనూష. విజయవాడ కరెన్సీనగర్‌కు చెందిన శంకర్‌రావు, నిర్మల దంపతుల కుమార్తె. శంకర్‌రావు వ్యాపారవేత్త కాగా.. తల్లి నిర్మల గృహిణి. చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండే అనూష.. విద్యలో ప్రతిభ చూపేది. ఆటల్లోనూ ప్రతిభ నిరూపించుకునేదీ అమ్మాయి.
క్రీడల్లో అనూష ప్రతిభ చూసి.. కానూరులోని పీవీపీ సిద్ధార్థ పాఠశాల ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. లయోల కళాశాలకు వచ్చిన తర్వాత టెన్నిస్ క్రీడలో మెరుగైంది అనూష. థాయ్‌లాండ్‌లో జరిగిన టెన్నిస్ పోటీల్లో సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుబుల్స్‌లోనూ కాంస్యాలు సాధించింది. అలా రాణిస్తున్న సమయంలో క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఓసారి దిల్లీ వెళ్లింది. అచ్చం టెన్నిస్ క్రీడలా ఉన్న సాఫ్ట్ టెన్నిస్‌కు ఫిదా అయ్యింది అనూష.
ఆడాలన్న ఆసక్తి, తోటి క్రీడాకారుల ప్రోత్సాహంతో సాఫ్ట్ టెన్నిస్ పోటీల్లో అనూష పాల్గొంది. మెుదటి పోటీల్లోనే కాంస్యం గెలుచుకుని ఔరా అనిపించింది. తర్వాత టెన్నిస్ నుంచి సాఫ్ట్‌టెన్నిస్ క్రీడాకారిణిగా మారింది. తల్లిదండ్రులు, స్పాన్సర్ల ప్రోత్సాహంతో పోలాండ్, కొరియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది. అలా క్రీడల్లో రాణిస్తూనే.. డిగ్రీలో సైకాలజీ పూర్తి చేసింది.
Young Boy 3D Art with Technology: శిల్పకళకు సాంకేతిక త్రీడీ హంగులు.. జీవం ఉట్టిపడుతున్న విగ్రహాలు
ఇటీవల చైనాలో జరిగినా ఆసియా క్రీడల్లో దేశం తరుపున సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో 5వ క్రీడాకారిణిగా పోటీల్లో పాల్గొంది అనూష. ఈ పోటీల్లో స్వల్ప పాయింట్స్ తేడాతో ఓటమి చెందింది. ఉత్తరాది రాష్ట్రాల్లో సాఫ్ట్ టెన్నిస్‌ను ఎక్కువ ప్రోత్సాహిస్తున్నారని.. అయితే తెలుగు రాష్ట్రాలల్లో ఈ ఆటకు సరైన ప్రోత్సాహం అందటంలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఈ యువ క్రీడా కారిణి.
తమ బిడ్డ దేశం తరఫున ఆసియా క్రీడల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెబుతున్నారు అనూష తల్లిదండ్రులు. తాము ఇప్పటి వరకు అనూషను అంతర్జాతీయ క్రీడల వరకు తీసుకు వచ్చామని.. కానీ, ఇంకా క్రీడల్లో పతకాలు గెలవాలంటే ఎవరైనా చేయూతనివ్వాలని కోరుతున్నారు. భవిష్యత్‌లో జరగబోయే ప్రపంచ ఛాంపియన్, ఆసియా గేమ్స్‌లో తన బెస్ట్ ఇవ్వాలని.. ఇందుకోసం ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాని చెబుతోందీ సాఫ్ట్ టెన్నిస్ క్రీడాకారిణి.
నాలుగు గొడల మధ్య ఉండేకంటే క్రీడా మైదానంలో ఉంటేనే తనకు సంతోషమని అంటుంది అనూష. ఆసియా క్రీడల్లో సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో పొల్గొంది. ప్రస్తుతం ఏపీ సాఫ్ట్ టెన్నిస్ ఫెడరేషన్ తరపున క్రీడల్లో పాల్గొంటుంది. సరైన ప్రోత్సాహం అందిస్తే దేశానికి మరిన్ని విజయాలు సాధిస్తానని ధీమాగా చెబుతోందీ యువ క్రీడాకారిణి.