High Court: విచారణ కోర్టు నిర్దోషిగా ప్రకటించిన స్వల్ప కేసు వివరాన్ని పోలీసు ఎంపిక దరఖాస్తులో పేర్కొనకుండా గోప్యంగా ఉంచారనే కారణంతో నియామకాన్నే రద్దు చేయడం సరికాదని హైకోర్టు పేర్కొంది. ఓ వ్యక్తిని ఎస్సై ఉద్యోగం నుంచి తొలగిస్తూ 2012లో రాష్ట్ర ప్రభుత్వం, నియామక బోర్డు ఇచ్చిన మెమోను తప్పుపట్టింది. మెమోను రద్దు చేస్తూ ఏపీఏటీ(పరిపాలన ట్రైబ్యునల్) ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం 2012లో వేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు తాజాగా కొట్టేసింది. ఆ ఎస్సైని విధుల్లోకి తీసుకునే ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది. న్యాయస్థానం తీర్పుతో 11 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తికి విధుల్లో చేరే అవకాశం దక్కింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ వి.శ్రీనివాస్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
ఎస్సై పోస్టుల భర్తీ కోసం 2008లో ప్రకటన జారీ అయ్యింది. నెల్లూరుకు చెందిన ఎం విజయభాస్కర్ పాల్గొని ఎంపికయ్యారు. నియామక ఉత్తర్వులు పొందాక 2012 ఫిబ్రవరి 18న ప్రభుత్వం ఓ మెమో జారీచేస్తూ ఆయన నియామకాన్ని రద్దు చేసింది. ఏపీ పోలీసు రూల్స్ ప్రకారం ఆయన నియామకానికి అనర్హులుగా పేర్కొంది. 2004లో ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు అయ్యిందని, దానిని 2006 జూన్‌లో న్యాయస్థానం కొట్టేసిందనే విషయాన్ని దరఖాస్తులో వెల్లడించకుండా గోప్యంగా ఉంచారనే కారణంతో నియామకాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఆ మెమోపై విజయభాస్కర్ ఏపీఏటీని ఆశ్రయించారు. నియామకాన్ని రద్దు చేయడాన్ని ఏపీఏటీ తప్పుపడుతూ 2012లో తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాలుచేస్తూ 2012 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు నియామక బోర్డు, డీజీపీ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. అప్పట్లో విచారించిన కోర్టు ఏపీఏటీ తీర్పు అమలును నిలుపి వేసింది. దీంతో అప్పటి నుంచి విజయభాస్కర్.. ఎస్సై విధుల్లో చేరడానికి వీల్లేకుండా పోయింది. ఇటీవల ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.
విజయభాస్కర్ తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ వాదనలు వినిపించారు. కేసును దిగువ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో దరఖాస్తులో ఆ విషయాన్ని ప్రస్తావించడం మరిచిపోయారన్నారు. మరోవైపు పిటిషనర్‌పై నమోదైన కేసు స్వల్పమైనదన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. క్రిమినల్ కేసుల్లో ప్రాత ఉన్న విషయాన్ని గోప్యంగా ఉంచడం నిబంధనలకు విరుద్ధం అన్నారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం.. విజయభాస్కర్‌పై 2004లో నమోదు అయిన కేసు తేలికైనదని, సాక్ష్యాధారాలు లేవనే కారణంతో 2006లో దిగువ కోర్టు ఆ కేసును కొట్టేసిందని తెలిపింది. ఎస్సై నియామకాన్ని రద్దు చేయడం అన్యాయం అని పేర్కొంది. ఆయనపై నమోదు అయిన కేసు క్రూరమైనది కాదని గుర్తుచేసింది. విజయభాస్కర్‌ను విధుల్లోకి తీసుకునే ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇవీ చదవండి: