High Court on Advisors Appointment : సలహాదారుల నియామకంపై హైకోర్టు మరోసారి ఘాటుగా స్పందించింది. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి సలహాదారు ఏంటని ఆశ్చర్యం వ్యక్తంచేసింది. అన్నింటికీ సలహాదారులను నియమించుకుంటూ పోతే.. సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు అవుతుందని అభిప్రాయపడింది. ఇది చాలా ప్రమాదకరమని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
దేవాదాయశాఖ సలహాదారుగా జ్వాలాపురపు శ్రీకాంత్, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. సలహాదారుల నియాకమంలో రాజ్యాంగబద్ధతను తేలుస్తామని గతంలో చెప్పిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం.. రెండు పిటిషన్లపైనా గురువారం మరోసారి విచారణ చేసింది. ఉద్యోగుల సంక్షేమానికి సలహాదారు ఏమిటని ప్రశ్నించిన హైకోర్టు.. భవిష్యత్తులో ఉద్యోగుల టీఏ, డీఎలు ఇచ్చేందుకూ సలహాదారులను నియమిస్తారేమోనని అనుమానం వెలిబుచ్చింది.
విచారణ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి తరఫు న్యాయవాది హేమేంద్రనాథ్‌రెడ్డి స్పందిస్తూ.. తమ క్లైంట్‌కు కోర్టు ఇచ్చిన నోటీసు అందలేదన్నారు. జ్వాలాపురపు శ్రీకాంత్ నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌తో చంద్రశేఖర్‌రెడ్డి నియామకంపై దాఖలైన పిల్ జతైనట్లు మీడియా ద్వారా తెలుసుకొని వచ్చామన్నారు. దీనిపై జోక్యం చేసుకున్న ధర్మాసనం.. మీడియాలో చూసి రావడమేంటని ప్రశ్నించింది. కేసుల జాబితాను చూసుకోవాలి కదా అని వ్యాఖ్యానించింది. కోర్టు పంపిన నోటీసు మీకు ఎందుకు అందలేదని ప్రశ్నించింది. మీడియా ద్వారా తెలుసుకొని వచ్చామంటూ సంబంధం లేని వివరాలు ఎందుకు చెబుతున్నారని నిలదీసింది.
ఈ వ్యాజ్యం రాజకీయ ప్రేరేపితమని న్యాయవాది హేమేంద్రనాథ్‌రెడ్డి చెప్పగా... ఏ పిటిషన్‌లను ఎలా డీల్ చేయాలో తెలుసని హెచ్చరించింది. ఇక బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధికార ప్రతినిధి రాజశేఖరరావు తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. జ్వాలాపురపు శ్రీకాంత్ అంశంపై వివరాల సమర్పణకు ఏజీ సమయం కోరడంపై అభ్యంతరం తెలిపారు. దీనిపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలని కోరారు. తాను తరచూ వాయిదాలు తీసుకోనన్న ఏజీ... ప్రభుత్వ పరిపాలనలో సలహాదారుల జోక్యం ఉండదన్నారు. సలహాదారుల నియామకంపై ఇప్పటికే కొన్ని వివరాలు అందాయని, మిగిలిన సమాచారం సేకరించి కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని కోరారు. అందుకు సమయం ఇస్తూ విచారణను ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. దేవాదాయశాఖ సలహాదారుగా జ్వాలాపురపు శ్రీకాంత్ కొనసాగేందుకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.
ఇవీ చదవండి :