GST Inspections In Sushi Infra : భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుమారుడు సంకీర్త్ రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ దాని అనుబంధ సంస్థలపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. 24 బృందాల్లో మొత్తం 150 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం సుశీ ఇన్‌ఫ్రా ఎండీగా రాజగోపాల్ రెడ్డి కుమారుడు సంకీర్త్ రెడ్డి కొనసాగుతున్నారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతు ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగాయి. ప్రధాన కార్యాలయంతో పాటు ఆ సంస్థ డైరెక్టర్ల ఇళ్లపై కూడా సోదాలు నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సోదాలు ప్రారంభించిన అధికారులు.. సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్‌తో పాటు సుశీ అరుణాచలా హైవేస్ లిమిటెడ్, సుశీ చంద్రగుప్త్ కోల్ మైన్ ప్రైవేట్ లిమిటెట్ సంస్థల్లో ఈ సోదాలు నిర్వహించారు. ప్రధాన కార్యాలయంలో హార్డ్ డిస్క్‌లు, సీపీయూలు, ప్రాజెక్ట్ అలాట్మెంట్ డాక్యుమెంట్లు, జీఎస్టీ చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిన్నింటినీ వాజిజ్య పన్నుల కార్యాలయానికి తరలించారు. చెల్లింపుల్లో పలు అవకతవకలు జరిగినట్లు సమాచారం. దీనిపై అధికారులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
సోదాల అనంతరం స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, సీపీయూలు, హార్డ్ డిస్క్‌లు మూడు వాహనాల్లో తరలించారు. వీటన్నంటినీ తనిఖీ చేసిన తర్వాత అవకతవకలు ఉన్నాయని తేలితే కేసు నమోదు చేసే అవకాశం ఉంది. కాగా సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్‌కు ఇద్దరు డైరెక్టర్లు. సుశీ అరుణాచలా హైవేస్ లిమిటెడ్‌కు నలుగురు, సుశీ చంద్రగుప్త్ కోల్ మైన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ముగ్గురు డైరెక్టర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోదాల్లో జీఎస్టీ, వాణిజ్య పన్నుల అధికారులు పాల్గొన్నారు. ప్రధాన కార్యాలయంలోనే 10 బృందాలకు పైగా సోదాలు నిర్వహించాయి. కాగా మునుగోడు ఎన్నికల సమయంలో సుశీ ఇన్‌ఫ్రా పేరు చర్చల్లో నిలిచింది. రాజగోపాల్‌కు చెందిన సుశీ ఇన్‌ఫ్రా బ్యాంకు ఖాతాల నుంచి పలువురి ఖాతాలకు నగదు బదిలీ అయిందని ఓ పార్టీ ఫిర్యాదు చేసింది. అయితే ఆ సంస్థ తనది కాదని.. తన కుమారుడిదని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి..