Governor Abdul Nazir: ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్‌నజీర్... ఉత్తమ ప్రతిభ చూపించిన కలెక్టర్లతో పాటుగా... వివిధ రంగాల ప్రముఖులను సముచితంగా సత్కరించారు. విజయవాడ రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో గవర్నర్ పాల్గొన్నారు.
గవర్నర్ ప్రశంస: ప్రపంచంలో రెడ్‌క్రాస్ ఉద్యమాన్ని స్థాపించిన హెన్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్రంలో రెడ్‌క్రాస్ సొసైటీ గత మూడేళ్ల కాలంలో చేపట్టిన కార్యక్రమాలు.. అందించిన సేవల గురించి గవర్నర్ తెలుసుకుని ప్రశంసించారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడడం ఓ ఉద్యమంగా చేపట్టాలని గవర్నర్ పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల గురించి ప్రతి ఒక్కరు అవగాహన పెంపొందింపజేసుకోవాలని సూచించారు. పుడమిని కాపాడేందుకు హరితవనాలను అభివృద్ధి చేయాల్సి ఉందని గవర్నర్ పేర్కొన్నారు. భారీగా చెట్ల పెంపకంలో ప్రజలను భాగస్వాములను చేయాలని గవర్నర్ కోరారు.
రక్తదాతలను ప్రోత్సహించాలి: రక్తదాతలను ప్రోత్సహించాలని కలెక్టర్లతో పాటుగా సామాజిక కార్యకర్తలకు గవర్నర్ సూచించారు. కోవిడ్ సమయంలో గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక బహుళ ప్రయోజన ఆరోగ్య శిబిరాలు నిర్వహించిన సిబ్బందిని ఆయన అభినందించారు. వైద్య విద్య సంచాలకులు డాక్టర్ వి.వినోద్‌కుమార్, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి లఠ్కర్, విశాఖ జిల్లా కలెక్టరు ఎ. మల్లికార్జున, కాకినాడ జిల్లా కలెక్టరు డాక్టర్ కృతికా శుక్లా, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె.మాధవీలతలకు గవర్నర్ పతకాలు ప్రదానం చేశారు. రెడ్‌క్రాస్‌కు నిధులు సమీకరించిన వారితోపాటు వివిధ కార్యక్రమాల నిర్వహణకు తమవంతు సహకరించిన ముఖ్యలను గవర్నర్ జ్ఞాపికతో సత్కరించారు.
కాకినాడ జిల్లా కలెక్టర్ రెండోసారి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా శాఖ అధ్యక్షురాలు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాలకు అందించిన సేవలు, తోడ్పాటుకు ప్రతిష్ఠాత్మక గవర్నర్ పురస్కారానికి ఎంపికయ్యారు. జిల్లా కలెక్టర్ సంవత్సర కాలంలోనే రెండోసారి ఈపురస్కారానికి ఎంపిక అయ్యారు. మెుత్తంగా రాష్ట్రంలో అయిదు జిల్లాల కలెక్టర్లు ఈ పురస్కారానికి ఎంపిక అయ్యారు. అయితే కాకినాడ జిల్లా కలెక్టర్ మాత్రం సంవత్సర కాలంలోనే రెండోసారి ఈపురస్కారానికి ఎంపిక కావడం విశేషం. తమ జిల్లా కలెక్టర్ రెండు సార్లు ఎంపిక కావడం తమకు గర్వకారణమని రెడ్‌క్రాస్ జిల్లా శాఖ ఛైర్మన్ వైడి.రామారావు పేర్కొన్నారు.
'రాష్ట వ్యాప్తంగా రక్త దానాలను ప్రోత్సహించాలి. ప్రజలంతా కలిసి మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడడం ఓ ఉద్యమంగా చేపట్టాలి. వాతావరణ మార్పుల గురించి ప్రతి ఒక్కరు అవగాహ పెంపొందింపజేసుకోవాల్సిన అవసరం ఉంది. పుడమిని కాపాడేందుకు హరితవనాలను అభివృద్ధి చేయాలి. భారీగా చెట్ల పెంపకంలో ప్రజలను భాగస్వాములను చేయాలి.'- ఎస్. అబ్దుల్‌నజీర్, రాష్ట్ర గవర్నర్
ఇవీ చదవండి: