Vijayawada Govt Hospital Staff Negligence: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఓ మహిళకు శాపంగా మారింది. పాము కరిచిందని ఆస్పత్రికి వస్తే.. చికిత్స చేసిన వైద్యులు పొరపాటున చేతికి కట్టిన బ్యాండేజ్‌లో సర్జరీ బ్లేడ్ ఉంచి కట్టుకట్టారు. ఫలితంగా బాధితురాలి చెయ్యికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకింది. సిబ్బంది నిర్లక్ష్యానికి మహిళ పరిస్థితి విషమంగా మారిందని బంధువులు వాపోతున్నారు. వైద్యుల వాదన మాత్రం మరోలా ఉంది.
కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన తులసి.. గత నెల 28న ఇంట్లో మంచం కింద ఉన్న వస్తువులను సర్దుతుండగా ..చేతిపై పాము కాటు వేసింది. వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా.. విషం విరుగుడు కోసం ఇంజెక్షన్లు ఇచ్చారు. ఆ తర్వాత చెయ్యి నల్లగా మారడంతో.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలిని పరీక్షించిన వైద్యులు ..ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. రెండ్రోజులు ఆసుపత్రిలో ఉంచాక ఇంటికి తీసుకెళ్లమన్నారు. కానీ అప్పటికి ఇంకా చెయ్యి వాపు తగ్గలేదు. బాధితురాలు బాధతో విలవిల్లాడడాన్ని చూసిన బంధువులు ..ఈ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకెళ్లగా మళ్లీ పరీక్షించారు.
"నా చెయ్యికి కట్టుకట్టి అందులో బ్లేడ్ వదిలిపెట్టి మూడు రోజుల తర్వాత కట్టు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత అందులో చిన్న కత్తి ఉంది. నేను నర్సులను అడిగితే.. పొరపాటును జరిగింది ఏం కాదు అన్నారు. చేతికి ఇన్ఫెక్షన్ సోకిందని.. మోచేయి వరకూ తొలగించాలన్నారు"-తులసి, బాధితురాలు
పరిస్థితి విషమంగా ఉందంటూ చేతికి సర్జరీ చేసి వాచిపోయిన భాగాన్ని తీసేశారు. తర్వాత మోచేతి వరకు కట్టుకట్టి వార్డుకు మార్చారు. రెండ్రోజుల తర్వాత డ్రెస్సింగ్ చేసేందుకు కట్టు విప్పుతుండగా.. దాని లోపల బ్లేడ్ కనిపించింది. ఇదేంటని నర్సులను అడిగితే.. వైద్యాధికారులకు విషయం చెప్తామని చెప్పి.. శుభ్రం చేసి కట్టుకట్టి వెళ్లిపోయారని బాధితురాలు వాపోయారు. చేతికి కట్టిన కట్టు లోపల ఏదో గుచ్చుతున్నట్లు ఉందని చెబుతున్నా.. రెండు రోజులు ఎవరూ పట్టించుకోలేదంటూ బాధితురాలి భర్త సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు చేతికి ఇన్ఫెక్షన్ ఎక్కువైందని.. తొలగించాలని అంటున్నారని వాపోయారు.
డ్రెస్సింగ్ చేసేందుకు బ్యాండేజ్‌ను విప్పే సమయంలో వినియోగించే బ్లేడ్‌ను చూసి.. లోపల ఉంచేశారని బాధితురాలి బంధువులు పొరపాటుగా అనుకున్నారని ఆసుపత్రి వైద్యాధికారులు చెబుతున్నారు . విషప్రభావం వల్ల చేతికి సర్జరీ చేసి.. శుభ్రం చేశామని తెలిపారు. అది తగ్గడానికి సమయం పడుతుందని.. చేతిని తొలగించాల్సిన అవసరం లేదన్నారు. కొత్తగా వచ్చిన నర్సింగ్ సిబ్బంది అవగాహనా రాహిత్యంతో ఏదో చెబితే బాధితులు ఆందోళన చెందారంటూ వెల్లడించారు. బాధితురాలి చేతికి అవసరమైతే ప్లాస్టిక్ సర్జరీ చేస్తామన్నారు.
ఇవీ చదవండి: