Government Employees Relay Hunger Strike: తమ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు రిలే నిరహార దీక్షలు ప్రారంభించారు. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో.. కలెక్టరేట్‌ల వద్ద ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పలుమార్లు ఉద్యమబాట పట్టిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఉద్యోగులు మండిపడ్డారు. సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, డీఏ చెల్లింపులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో ఉద్యమం తీవ్రతరం చెస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. విజయకుమార్ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, నరసాపురం తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష చేశారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంఘ సభ్యులతో కలసి విజయకుమార్ నినాదాలు చేశారు.
సీపీఎస్‌ను రద్దు.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని గుంటూరు జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చాంద్ భాషా అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన నాలుగు హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. దానిలో భాగంగా సీపీఎస్‌ను రద్దు చేయాలని.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలు తీర్చే వరకు రిలే నిరాహార దీక్షలు ఆపేది లేదని స్పష్టం చేశారు.
ఉద్యోగుల సంఘం డిమాండ్ : ఉమ్మడి విజయనగరం జిల్లా శాఖలు ఆయా జిల్లా కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి. ఇందులో భాగంగా విజయనగరంజిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఉద్యోగ, ఉపాధ్యాయ, ఒప్పంద, ఔట్ సోర్సింగ్, గ్రామ వార్డు సచివాలయ, పెన్షనర్లు పెద్దఎత్తున పాల్గొన్నారు. దీర్ఘకాల సమస్యలు పరిష్కరించాలని, ఇచ్చిన హామీలు, చేసుకున్న ఒప్పందాలు అమలు చేయమని, ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేటట్లు చట్టం చేయాలని ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. సీపీఎస్ రద్దు చేయాలని, డీఏ బకాయిలు విడుదల చేయాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి నివేదించినా సరియైన స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఆందోళన బాట పట్టామన్నారు. ఇప్పటికైనా ఉద్యోగుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు.
ఏ మాత్రం స్పందించని ప్రభుత్వం : ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ముందు ఏపీ ప్రభుత్వం ఉధ్యోగుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరహారా దీక్షలు ప్రారంభం అయ్యాయి. గత కొన్నాళ్లుగా వివిధ రూపాల్లో ఉద్యమిస్తున్న, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదని తమ హక్కుల సాధన కోసం నిరసనలు కొనసాగుతాయని ఉద్యోగులు తెలిపారు.
"రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు సంఘం రిలే నిరాహార దీక్ష చేస్తుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. సీపీఎస్‌ను రద్దు చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. ఈ సమస్యలు పరిష్కరించేత వరకూ ఆందోళనలు విరమించేది లేదు. మా డిమాండ్లు నెరవేర్చకపోతే నవంబర్ మొదటి వారంలో చలో విజయవాడ కార్యక్రమం చేపడతాం."- ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
ఇవీ చదవండి