FREE TIFFA SCANNING FOR PREGNANT WOMEN : మిషన్ స్మైల్ సంస్థ, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సంయుక్తంగా ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు . గ్రహణం మొర్రి వచ్చిన 18 మంది చిన్నారులకు ఉచితంగా శస్ర్తచికిత్స చేసి.. వారికి చిరునవ్వులను అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల మంది చిన్నారులు ఈ తరహా సమస్యలతో బాధపడుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు అన్నారు. తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా గర్భిణులకు ఉచితంగా ‘టిఫా’ (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ ఎనామలిటీస్) స్కానింగ్ సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ స్కానింగ్ ద్వారా గర్భస్థ శిశువుల లోపాలను గుర్తించి, ముందుగానే జాగ్రత్త పడేందుకు వీలవుతుందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో రేడియాలజిస్టులు ఉన్న చోట ఈ టిఫా స్కానింగ్ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో ఈ సౌకర్యం త్వరలోనే వస్తుందన్నారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు ప్రత్యేక కాల్‌సెంటర్ ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
2023-24 విద్యా సంవత్సరం నుంచి 5 ప్రభుత్వ వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని.. వీటిని వారంలోగా ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీ చేస్తాయని తెలిపారు. 2024-25లో ఐదు, 2025-26 విద్యా సంవత్సరంలో మరో ఏడు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌లో తరగతులు ప్రారంభమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. పీజీ సీట్ల పెంపు కోసం కేంద్రం రూ.700 కోట్లను కేటాయించిందని.. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ప్రకారం కొత్త వైద్య కళాశాలలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న నర్సింగ్ కళాశాలలకు నిధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన అధ్యయనంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 75% మంది జనాభాకు దీర్ఘకాలిక వ్యాధులపై పరీక్షలు చేయగా 28% మందికి బీపీ, 25.3% మందికి మధుమేహం ఉన్నట్లు తేలిందన్నారు. ఇలాంటి వారికి ఉన్నత వైద్యం, మందులు అందిస్తూ అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. ఈ విధానంలో క్యాన్సర్, ఇతర వ్యాధులు ఉన్నవారిని గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: