ETV Bharat special story on Jagananna Suraksha programme: వ్యాధులు నయమయ్యే వరకు రోగులను చేయిపట్టి నడిపిస్తామని గతంలో సీఎం జగన్ బీరాలు పలికారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దానికి విరుద్ధంగా ఉంది. ఇటీవల నిర్వహించిన వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు పెద్దగా ఏ ప్రయోజనం చేకూరలేదు. 50 లక్షల మంది ఓపీ ద్వారా చికిత్స పొందితే కేవలం 85 వేల మందిని అంటే 1.7 శాతం మాత్రమే పెద్దాసుపత్రులకు రిఫర్ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చూసినా... 50 లక్షలకు కనీసం అయిదు లక్షల కేసులను 'రిఫరల్' కింద గుర్తించాలి. అందులోను బీపీ, మధుమేహం ఉన్న వారిని గుర్తించేందుకు ప్రస్తుత వ్యవస్థ సరిపోతుంది. వీటి గురించి వైద్య శిబిరాల్లో ప్రత్యేకంగా స్పెషలిస్టు వైద్యులను ఏర్పాటుచేసి ఆర్భాటం చేయాల్సిన అవసరం లేదు. పోనీ ఇంత చేసినా జగన్ ప్రభుత్వం సాధించింది ఏంటో... 120 కోట్ల ఖర్చుతో ప్రజలకు ఒనగూరిన ప్రయోజనం ఏంటో ముఖ్యమంత్రే స్పష్టంచేయాలి.
తాజా సమాచారం ప్రకారం 8వేల971 వైద్య శిబిరాల ద్వారా 50 లక్షల మందికి ఓపీ విధానంలో పరీక్షలు నిర్వహించారు. ఈ 50 లక్షల మందిలో 9 లక్షల మందికి కంటి పరీక్షలు జరిగాయి. కంటి-వెలుగు కింద నిర్వహించే పరీక్షలను ఈ వైద్య శిబిరాలకు అదనంగా అనుసంధానపరిచారు. ఇందులో 9 లక్షల మందిని మినహాయించగా... మిగిలిన 50 లక్షల్లో.. 85 వేల మందిని మాత్రమే వివిధ ఆసుపత్రులకు రిఫర్ చేశారు. శాస్త్రీయ అంచనాల ప్రకారం.. ఓపీ ద్వారా చికిత్స పొందే వారిలో కనీసం 10శాతం మందికి రిఫరల్ వైద్య సేవలు అవసరమవుతాయి. దీనికి భిన్నంగా రెండు శాతం మందిని కూడా రిఫరల్ కింద గుర్తించకపోవడం వైద్య శిబిరాల్లో ఓపీ ద్వారా అందిన సేవల తీరును ప్రశ్నార్ధకం చేస్తోంది. గైనిక్, జనరల్ మెడిసిన్, పిడీయాట్రిక్స్, ENT, డెర్మటాలజీ, ఇతరుల విభాగాలతో కలిపి 3వేల500 మంది స్పెషలిస్ట్ వైద్యులు కూడా ఈ వైద్య శిబిరాల్లో పాలుపంచుకున్నారు. పీహెచ్‌సీ వైద్యులకు వీరు అదనం. స్పెషలిస్టు వైద్యుల్లో కొందరు ఈ శిబిరాల్లో ఎక్కువ సమయాన్ని కేటాయించలేదు. బీపీ, మధుమేహంతో బాధపడే వారిని గుర్తించామని గణాంకాల్లో వెల్లడించిన ప్రభుత్వం.. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం, ఉప ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్‌లీ ద్వారా ఈ వ్యాధిగ్రస్థులను గుర్తించే కార్యక్రమం ఇదివరకే కొనసాగుతున్నప్పుడు ఇంత ఆర్భాటం చేయాల్సిన అవసరం ఏముందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
వైద్య శిబిరాలకు హాజరైన వారికి పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించేందుకు సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యంగా మహిళలకు పరీక్షల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. రోగులకు ఇళ్ల వద్ద కొన్ని పరీక్షలు నిర్వహించారు. మధుమేహం, బీపీ పరీక్షల ఫలితాల ఆధారంగా కొంతమందికి మాత్రలు ఇచ్చారు. శిబిరాలకు వచ్చిన వారికి స్పెషలిస్టు వైద్యులకు తక్కువ సమయం కేటాయించారు. ఈ నేపథ్యంలో రిఫరల్ కేసులు బాగా తగ్గాయి. 85 వేల రిఫరల్ కేసులు రాగా... 70 వేల మందిని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపారు. వీరికి అక్కడ ప్రత్యేకంగా సూచనలు చేసేవారు లేరు. ఇలాంటి వారికి ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో ఓపీలో చూసే రోగులకు చికిత్స అందిస్తున్న రీతిలోనే... వైద్యులు రిఫరల్ రోగుల విషయంలోనూ వ్యవహరిస్తున్నారు.
కొన్ని సచివాలయాల పరిధిలో జనాభా రెండు వేల నుంచి మూడు వేల వరకు ఉండగా.. 75శాతం మంది హాజరైనట్లు రికార్డుల్లో పేర్కొనడం అనుమానాలకు తావిస్తోంది. తొమ్మిది లక్షల మందికి వైద్య శిబిరాల ద్వారా కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో సుమారు 5.50 లక్షల మందికి కంటి అద్దాలు అవసరమని అధికారులు గుర్తించారు. 75 వేల మందికి శస్త్రచికిత్సలు అవసరమని పేర్కొన్నారు. నిజానికి కంటి వెలుగు కార్యక్రమం ద్వారా చాలాకాలం నుంచి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ జనవరి నుంచి ప్రతి మండలంలో నెలకు కనీసం నాలుగు వైద్య శిబిరాలు నిర్వహించే విధంగా ప్రభుత్వం ప్రాణాళికలు రచించింది. వస్తున్న రిఫరల్ కేసుల సంఖ్యను చూస్తుంటే... ఈ వైద్య శిబిరాల ద్వారా ఫలితాలు ఏమేరకు ఉంటాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. సీఎం బొమ్మలతో ఉన్నకరపత్రాలు, బ్యాగులు, ఫైళ్ల పంపిణీకి ఈ శిబిరాలు ఉపయోగపడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఐప్యాక్ కనుసన్నుల్లోనే ఈ శిబిరాల నిర్వహణ మొత్తం జరుగుతోంది. ప్రతి రిఫరల్ కేసుకు ప్రయాణ ఖర్చుల కోసం 500 వంతున చెల్లిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. కానీ ఇందుకు అవసరమైన నిధుల మంజూరు ఎలా అన్న దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. నిధుల కేటాయింపుపై స్పష్టత వస్తేనే నగదు చెల్లించే అవకాశముంది.
అనారోగ్యంతో ఉన్నవారికి చేదోడుగా నిలిచేందుకే 'జగనన్న ఆరోగ్య సురక్ష': సీఎం జగన్