Passengers Problems Due To YCP BC Sabha: విజయవాడలో అధికార వైసీపీ నిర్వహించిన జయహో బీసీ మహాసభ..రాష్ట్రంలోని వేలాది ప్రయాణికుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఉత్తరాంధ్ర మెుదలుకుని దాదాపు అన్ని జిల్లాల నుంచి వైసీపీ బీసీ సభకు బస్సుల్ని పెట్టడంతో..ప్రయాణికులు గమ్యస్థానాల్ని చేరేందుకు అవస్థలు పడ్డారు. రాష్ట్ర నలుమూలల నుంచి 1630 బస్సుల్ని సభకు పెట్టడం ద్వారా నరకమంటే ఎలా ఉంటుందో ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ చూపించింది. జిల్లాల్లోని ఆర్టీసీ బస్టాండ్లు బస్సుల్లేక బోసిపోయాయి. గంటలతరబడి ఎదురుచూసినా బస్సులు రాకపోవడం, ప్రయాణికులకు సమాచారం లేకపోవడం, వచ్చిన ఒకటి, ఆరా బస్సులు కిక్కిరిసిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు..
సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ సర్వీస్ బస్సుల్ని సభకు పంపించడంతో విజయవాడ, విశాఖ నగరాల్లో తిరిగే సిటీ బస్సుల్ని ఆయా జిల్లాల్లోని దూర ప్రాంతాలకు తిప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో 100పల్లె వెలుగులు బస్సుల్ని సభకు తరలించడంతో జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ, నూజీవీడు, మైలవరం డిపోల పరిధిలోని గ్రామాలకు సర్వీస్‌లు నిలిచిపోయాయి. విశాఖ నుంచి పార్వతీపురం, బొబ్బిలి, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు సిటీ సర్వీసు బస్సుల్ని నడిపించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో విజయనగరం డిపో నుంచి 37, శృంగవరపు కోట నుంచి 12, పార్వతీపురం డిపోకు చెందిన 26, పాలకొండ డిపో నుంచి 38 బస్సులు జయహో బీసీ మహాసభకు పెట్టడంతో బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాశారు.
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బస్సుల కోసం ప్రయాణికులు, విద్యార్థులు గంటల తరబడి నిరీక్షించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోనూ ఇదే పరిస్థితి. కోనసీమ జిల్లాలోని రాజోలు, రావులపాలెం నుంచి బస్సుల్ని సభకు పెట్టడంతో..ప్రజలకు అవస్థలు తప్పలేదు. ఇక వైసీపీ బీసీ సభ సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. విద్యార్ధులు, ఉద్యోగులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోయారు . ట్రాఫిక్ మళ్లింపులపై సరైన సమాచారం లేకపోవడంతో బస్టాపుల్లో గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షించారు. కొంతమంది ప్రయాణాలను వాయిదా వేసుకుని ఇంటిముఖం పట్టారు.
ఇవీ చదవండి: