Deputy CM Pawan Kalyan Speech in Assembly: వరుస దోపిడీలు, అరాచకాలే వైఎస్సార్సీపీ సర్కారు నుంచి కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సమర్థ నాయుకుడు సీఎం చంద్రబాబు అని కితాబిచ్చారు. కూటమి ప్రభుత్వం 150 రోజుల ప్రగతిపై శాసనసభలో జరిగిన చర్చలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. చంద్రబాబు సమర్థ నాయకత్వంలో రాష్ట్రం త్వరలోనే ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని పవన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
డొక్కా సీతమ్మ పేరు పెట్టటం అభినందనీయం: గత ప్రభుత్వంలో జగన్ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆస్తుల పత్రాలపై బొమ్మలు పెట్టుకున్నారని పవన్ విమర్శించారు. విద్యార్ధుల మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టటం అభినందనీయమని తెలిపారు. సామాజిక మాధ్యమాల విషయంలో అసభ్యకరమైన పోస్టుల విషయంలోనూ కఠినంగా వ్యవహరించారని అన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలపైనా అసభ్యకరమైన పోస్టులు పెట్టారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులమని చెప్పుకునే గూండాలకు గట్టి హెచ్చరిక చేసిన సీఎం, హోం మంత్రికి పవన్ ధన్యవాదాలు తెలిపారు. ఇసుక, బెల్డు దుకాణాలు ఇతర అంశాలపై సీఎం ఆశయాలను నెరవేర్చేలా మంత్రులంతా పనిచేస్తామని హామీ ఇస్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు.
మిస్సింగ్ మహిళల ఆచూకీ గుర్తించిన పోలీసులు - అభినందించిన పవన్ కల్యాణ్
గత ప్రభుత్వం ఫిల్టర్ బెడ్లు కూడా మార్చలేదు: రక్షిత మంచినీరు పొందటం ప్రజల ప్రాథమిక హక్కు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. జలజీవన్ మిషన్పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం సమాధానం ఇచ్చారు. నిర్దేశిత సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా రక్షిత తాగునీటిని అందించేలా కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. రక్షిత తాగునీటి సరఫరా కోసం గత ప్రభుత్వం కనీసం ఫిల్టర్ బెడ్లు కూడా మార్చలేదని అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ను రాష్ట్రంలో విస్తృత పరుస్తామని తెలిపారు. అధికారులు కట్టుదిట్టంగా జలజీవన్ మిషన్ పథకాన్ని అమలు చేసేలా కార్యాచరణ చేపట్టాల్సిందిగా సూచించారు.
కలుషిత నీరు తాగటం వల్ల ఉద్దానం, ప్రకాశం జిల్లా, ఎన్టీఆర్ ఎగువ ప్రాంతాల్లోని ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్న పరిస్థితులు ఉన్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు. జలజీవన్ మిషన్ పథకం వినియోగించుకోవటంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలవాలని అన్నారు. 2027 వరకూ జలజీవన్ మిషన్ పథకాన్ని కేంద్రం పొడిగించిందని గడువులోగా దీన్ని సమర్ధంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలకు తాగునీరు అందించాలన్న సంకల్పం అందరిలోనూ ఉండాలని అన్నారు.
వాటర్ గ్రిడ్ తరహాలో డంపింగ్ యార్డులు ఏర్పాటు: పవన్ కల్యాణ్
శాసన మండలిలో మాటల యుద్ధం - వైఎస్సార్సీపీ అక్రమాలను ఎండగట్టిన మంత్రులు