Leaning Building Demolition At Hyderabad : హైదరాబాద్ గచ్చిబౌలిలోని సిద్ధిఖీ నగర్‌లో ఒరిగిన నాలుగంతస్థుల భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. ఇప్పటికే భవనాన్ని కూల్చివేసేందుకు అక్కడ హైడ్రాలిక్ యంత్రాలతో పనులు కొనసాగిస్తున్నారు. అంతకముందు ఒరిగిన భవనం చుట్టూ ఉన్న స్థానికులను జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులు ఖాళీ చేయించారు. సిద్ధిఖీనగర్‌లో 50 గజాల్లో నిర్మించిన ఈ భవనం మంగళవారం రాత్రి ఒక్కసారి ఒకపక్క ఒరిగిపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
గుంతల తవ్వకం వల్లనే: గత మూడు రోజుల క్రితం ఆ భవనం వెనుక ఓ కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. పెద్ద ఎత్తున గుంతల తవ్వకం కొనసాగించడంతో ఫలితంగా మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో భవనం ఒక్కసారిగా ఒక పక్కకు ఒరిగింది. అందులోని దాదాపు 30 మంది ప్రాణభయంతో బయటకు పరుగు తీయగా మూడో అంతస్థులోని ఇక్బాల్ హుస్సేన్ అనే వ్యక్తి భయంతో పైనుంచి కిందకు దూకారు. గాయపడ్డిన వ్యక్తిని స్థానికులు హుటాహుటిన దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
పరిహారం ఇప్పించాలి : పక్కన మరో బిల్డింగ్ నిర్మాణానికి గుంతలు తవ్వడంతోనే తమ భవనం పక్కకు ఒరిగిందని యజమానురాలు స్వప్న తెలిపారు. రెండు సంవత్సరాల క్రితమే ఈ ఇంటిని కట్టుకున్నామని, మంగళవారం రాత్రి పక్కకి ఒరగడం వల్ల మేమందరం ఖాళీ చేశామని వారు తెలిపారు. భవనం కూలిపోతే చుట్టుపక్కల వారికి ఇబ్బంది ఉంటుందనే తొలగించేందుకు సిద్ధమవుతున్నామని అన్నారు. కూల్చివేసేందుకు తాము అంగీకరిస్తామని, కానీ పక్క భవనం యజమానితో పరిహారం ఇప్పించాలని కోరారు.
ఊళ్లలోని పొలాలు అమ్మి, అప్పులు చేసి మరీ ఇంటిని కట్టామని, ఉన్న ఈ ఆధారం కోల్పోతే మా పిల్లల పరిస్థితి ఏంటని లబోదిబోమంటున్నారు. భవనం కూల్చివేతతో తనతో పాటు తన పిల్లలు రోడ్డున పడతారని వాపోయారు. మరోవైపు సిద్దిఖీనగర్‌లో సామర్థ్యానికి మించి అనేక బిల్డింగులు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు చేపడతామని తెలిపారు. ఇల్లు కూలడానికి ప్రధాన కారణమైన పొరుగింటి భూ యజమానిపై కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు వెల్లడించారు.
ఇదిలావుంటే భవనం కూల్చివేస్తున్న హైడ్రాలిక్ యంత్రం మరమ్మతులకు గురైంది. అధికారులు పనులు నిలిపివేసి ఆ యంత్ర మరమ్మతులు చేశారు. రిపేర్ అనంతరం మళ్లీ కూల్చివేత పనులు కొనసాగిస్తున్నారు.
గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన 5 అంతస్థుల భవనం - స్థానికుల్లో టెన్షన్ టెన్షన్