Drainage Problem Heavy In Vijayawada: విజయవాడలో మురుగు కాల్వల పరిస్థితి రోజురోజుకి అధ్వానంగా మారుతోంది. వర్షాకాలం ప్రారంభమయినా.. డైనేజ్లలో పేరుకుపోయిన చెత్తా, చెదారం నగరపాలక సంస్థ అధికారుల తొలగించటంలేదు. దీంతో నగరంలోని ప్రధాన కాలువల సైతం అపరిశుభ్రంగా మారుతున్నాయి. పారిశుద్ధ్య లోపంతో మురుగు కాల్వలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. రెండు నెలల క్రితం నగరానికి చెందిన ఐదేళ్ల అభిరామ్ అనే బాలుడు మురుగుకాల్వలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఇలా పడి మరణించిన ఘనటలు అనేకం. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు.
విజయవాడ నగరంలో చిన్నపాటి వర్షానికే మురుగు కాలువలు పొంగిపొర్లుతున్నాయి. వర్షం వస్తే నగరంలోని చాలా కాలనీలు మురుగునీటితో రహదారులు మొత్తం మునిపోతున్నాయి. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షం కురిస్తే నగర ప్రజలు మురుగు నీటితో పెద్ద యుద్ధమే చేయాల్సివస్తోంది. మురుగు నీటి కాలువలు నిర్వాహణ సక్రమంగా లేకపోవడంతో దోమలు, ఈగలకు నిలయాలుగా మారుతున్నాయి. అపారిశుధ్యం కారణంగా నగరవాసులు పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. నగరంలో చాలా వరకు డ్రైనేజీలపై పైకప్పులు లేవు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ సౌకర్యం పూర్తి స్థాయిలో లేనే లేదు. దీంతో అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు.
"వర్షకాలం వచ్చిందంటే తీవ్రమైన ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ఒకవైపు మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. మరోపక్క మోకాలు లోతులో నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ఏ బజారులో చూసినా వీఎంసీ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది." - స్థానికుడు
"డ్రైనేజి వ్యవ్యస్థ చాలా దుర్భరంగా ఉంది. దోమల బెడద ఎక్కువగా ఉంది. దీనివల్ల విషజ్వరాల భారీన పడే అవకాశం ఉంది. అధికారులు వీటి వల్ల వచ్చే ఇబ్బందులను అరికట్టేందుకు ప్రయత్నించాలని కోరుతున్నాను."- స్థానికుడు
నగరంలో చిన్న పెద్ద అన్నీ కలిపి 1237 ఓపెన్ డ్రైనేజీలు ఉన్నాయి. 2007లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు 175 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రస్తుతం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు ఉన్న ఇళ్లు 1.01 లక్షలు ఉండగా.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు లేని ఇళ్లు నగరంలో 1.09 లక్షలు ఉన్నాయి. చాలా ఇళ్లకు ఓపెన్ డ్రైనేజీ సైతం లేదు. దీంతో మరో మార్గం లేక ఇంటి యజమానులే చిన్న డ్రైనేజీలు వారి అవసరాలకు తగినట్లుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేక చిన్న వర్షానికే వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతోందని ప్రజలు అంటున్నారు. దీంతో పాటు ప్రధాన రోడ్లు సైతం చిన్నపాటి వర్షానికే జలమయమవుతున్నాయి. వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని నగరవాసులు అంటున్నారు. వర్షం నీరు రోడ్లపై నిలవడం, రోడ్లు గుంతలమయంగా ఉండడంతో తమ వాహనాలు పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"చిన్నపాటి వర్షం వచ్చిన రోడ్లన్ని మునిగిపోయే పరిస్థితి వస్తోంది. ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి. వీపరితమైన ట్రాఫిక్ ఏర్పడుతోంది."- వాహనాదారుడు
నగరంలో ముఖ్యమైన సెంటర్లలో కూడా మురుగు కాలువలపై పైకప్పు లేదు. పైకప్పులు ఏర్పాటు చేయడంలో నగర పాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. పన్నులు వసూళ్లు చేయడంపై వీఎంసీ అధికారులకు ఉన్న శ్రద్ధ నగరాన్ని అభివృద్ధి చేయడంపై లేదని నగర ప్రజలు మండిపడుతున్నారు. ఇంటి పన్ను, నీటి పన్ను, చెత్తపన్ను పేర్లతో ప్రజలపై భారాలు వేస్తున్న.. మురుగు కాల్వలపై పైకప్పు ఏర్పాటు చేయటం లేదని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురుగు కాలువల సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదని ప్రజలు వాపోతున్నారు.