CPI State Secretary K Ramakrishna: ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. ఆరుగాలం కష్టపడి పండించిన తమ పంట నీటి పాలు కావడంతో.. అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అప్పులు చేసి పంట వేయగా.. వర్షాల వల్ల నష్టపోయి అప్పుల ఊబిలో చిక్కుకున్నారు.. ఆ అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్యలే శరణ్యమని రైతులంటున్నారు.
నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టైనా లేదని.. ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకుండా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దెబ్బ తిన్న పంటలను పరిశీలించి.. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేస్తుంటే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడంలేదని ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు 150 అడుగులు కన్నా తగ్గిస్తే దాని ప్రయోజనాలు రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు దక్కకపోగా, ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుందనే ఆశ కలలో కూడా నెరవేరదని అన్నారు. జగన్ పిరికిపంద చర్యల వలన రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నా మాట్లాడటం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసేలా ప్రవర్తిస్తే మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని మండిపడ్డారు. పోలవరం ప్రయోజనాలను కాపాడాలని 27, 28 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు. ప్రజాస్వామ్య హక్కులను ప్రధాని మోదీ ఏ మాత్రం గౌరవించడం లేదన్నారు. ఆదాని వ్యవహారంపై జెపీసీ అడిగితే ఎందుకు వెయ్యరు.. పైగా ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీని అనర్హతకు గురి చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించారన్నారు. ప్రపంచం అంతా ఆదానీ గురించి మాట్లాడుతుంటే.. జగన్ మాత్రం కేబినెట్ మీటింగ్‌లో ఆదానీకి భూములు కట్టబెడుతున్నారని అన్నారు. అదానీ వ్యహారంపై చంద్రబాబు ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు చంద్రబాబు కూడా మాట్లాడాలన్నారు.
జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన పోలవరం ప్రాజెక్ట్‌ని.. ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదు.. 150 అడగుల ఎత్తులో నిర్మించాల్సిన ప్రాజెక్ట్‌ని 135 అడుగులకే నిర్మిస్తాము.. నిర్వాసితులకు నష్టపరిహారం ఇస్తాము.. అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. మీ ప్రభుత్వ చేతకానితనం వల్ల కేంద్ర ప్రభుత్వంపై మాట్లాడే ధైర్యం లేనందువల్ల.. రాష్ట్రానికి చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బదీసే పద్దతిలో ఇంత అన్యాయం జరుగుతుంటే.. మీరు ఏమీ మాట్లాడరు. ఇదే కనుక జరిగిందంటే రాష్ట్ర చరిత్రలో చరిత్ర హీనుడిలా మిగిలిపోతావు.- రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఇవీ చదవండి: