CPI RamaKrishna on Current Charges Hike : సర్దుబాటు చార్జీలు ట్రూ అప్ చార్జీల పేరుతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం భారాలు మోపుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన విద్యుత్ సంస్కరణలను రాష్ట్రంలో అత్యుత్సాహంతో ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో 7 వేల రూపాయలు ఉన్న స్మార్ట్ మీటర్‌ని.. అవసరం లేకపోయినా రాష్ట్ర ప్రజలపై రుద్దేందుకు 37 వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తూ.. మరో భారాన్ని ప్రజలపై మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యమ కార్యాచరణ : వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టపగలే దోపిడీ చేస్తుందని మండిపడ్డారు. తక్షణమే ఆదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని కె. రామకృష్ణ అన్నారు. జూన్ 15వ తేదీన అన్ని పార్టీలు ప్రజాసంఘాలతో విద్యుత్ చార్జీలు, స్మార్ట్ మీటర్ల ప్రతిపాదనలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. విద్యుత్ భారాలను తగ్గించే వరకు చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై సమావేశంలో తీర్మానం చేస్తామన్నారు.
విద్యుత్ సంస్కరణలను మన రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ఉత్సాహంతో అమలు చేస్తున్నారు. దాని ఫలితంగా విద్యుత్ వినియోగదారులు ఇబ్బందులకు లోనవుతున్నారు.ఒకవైపు సర్దబాటు చార్జీలు, మరోవైపు ట్రూ అప్ చార్జీల పేరుతో పేదవారిపై జగన్ భారం మోపుతున్నారు. ఎలాంటి అవసరం లేకపోయిన స్మార్ట్ మీటర్లతో పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. -కె. రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఫెర్రో అల్లాయిస్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ జగన్‌కు బహిరంగ లేఖ : రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించి తమ సంస్థను కాపాడాలని కోరుతూ ఏపీ ఫెర్రో అల్లాయిస్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసింది. విద్యుత్ టారిఫ్‌ల కారణంగా ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమ భారీగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. 39 ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు 800 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నాయని, భరించలేని టారిఫ్‌ల కారణంగా పరిశ్రమలు నష్టపోతున్నాయని లేఖలో పేర్కొంది. ఉత్పత్తి వ్యయంలో 35 నుంచి 70 శాతం వరకు విద్యుత్ వినియోగ ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేసింది.
జీఎస్టీ రూపంలో ఏడాదికి వెయ్యి కోట్లు : రాష్ట్రంలోని 3 డిస్కమ్‌లకు 3 వేల కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నట్టు వెల్లడించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న తమ పరిశ్రమను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాని కోరింది. ఒక్క జీఎస్టీ రూపంలోనే ఏడాదికి వెయ్యి కోట్లు చెల్లిస్తున్నామని వివరించింది. ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బంగాల్, జార్ఖండ్‌లో విద్యుత్ టారిఫ్ తక్కువగానే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీగా ఉన్న విద్యుత్ టారిఫ్‌లను తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని అసోసియేషన్ లేఖలో కోరింది.