Vehicular Traffic at Toll Plaza: హైదరాబాద్ నుంచి సొంత గ్రామాలకు వస్తున్న ప్రయాణికుల వాహనాలతో తెలుగు రాష్ట్రాల సరిహద్దులలో జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద రద్దీ పెరుగుతోంది. హైదరాబాద్‌లో నిన్నటి నుంచి స్వగ్రామాలకు తిరుగు పయనమైన ఆంధ్ర ప్రాంత ప్రజల వాహనాలతో హైదరాబాద్ - విజయవాడ, హైదరాబాద్ - కర్నూలు జాతీయ రహదారులు సందడిగా మారాయి. విజయవాడకు వెళ్లే ప్రయాణికుల వాహనాల రద్దీ.. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్ ప్లాజా, కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద క్రమంగా రద్దీ పెరుగుతోంది.
అటు హైదరాబాద్ - కర్నూలు జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అధికమవుతోంది. నల్లొండ - మిర్యాలగూడ - గుంటూరు జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన తుమ్మలచెరువు టోల్‌ప్లాజా వద్ద వాహనాలు క్యూకడుతున్నాయి. భద్రాచలం నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై బాడవ టోల్ ప్లాజా వద్ద కూడా రద్దీ పెరుగుతోంది. వాహనాల ఫీజు చెల్లించేందుకు ఫాస్ట్ ట్రాక్ ఉండటంతో వాహనాలు ఎక్కువసేపు ఉండకుండా ఆంధ్రా వైపు వెళ్తున్నాయి.
ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఫాస్ట్ ట్రాక్ పనిచేయకపోతే టోల్ యాజమాన్యం వెంటనే డబ్బులు తీసుకొని రసీదులు ఇస్తున్నారు. ఈ క్రమంలో కొద్దిగా ఆలస్యం అవుతోంది. ఈరోజు సాయంత్రానికి ఇంకా వాహనాల రాక ఎక్కువగా ఉంటుందని టోల్ ప్లాజా సిబ్బంది భావిస్తున్నారు. టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఆగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకున్నామని అన్నీ టోల్ ప్లాజా మేనేజర్లు తెలిపారు. ఇప్పటికే విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం జాతీయ రహదారిపై ఆరు కౌంటర్లను ఏర్పాటు చేశారు.
స్వగ్రామానికి వెళ్లే ప్రయాణికులకు, వారి వాహనాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని టోల్‌ప్లాజా అధికారులు తెలిపారు. అలాగే ప్రయాణికులకు తాగునీరు, వసతి సౌకర్యాలు కల్పించారు.ఆంధ్రా ప్రజలకు సంక్రాంతి ఎంతో సందడి చేకూర్చే పండగ. కాబట్టి ఈ పండగ కోసం ఆంధ్రా వాసులంతా ఆయా ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు పయనమయ్యారు. దీంతో భారీగా వాహనాలన్నీ ఆంధ్రాకు క్యూకడుతున్నాయి. దీంతో టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీ పెరిగింది.
ఇవీ చదవండి: