Condolences of TDP leaders : కందుకూరు తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనలో అపశ్రుతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నిమ్మకాయల చినరాజప్ప విచారం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తల కుటుంబ సభ్యుల్ని కోల్పోయి తాము బాధల్లో ఉంటే.. మంత్రులు సిగ్గు లేకుండా శవరాజకీయాలు చేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తమ పార్టీ నేతలు రూ.23.5 లక్షల రూపాయల సాయం మృతుల కుటుంబాలకు అందచేస్తున్నారని తెలిపారు. ప్రధాని స్పందించిన తరువాత, తాను స్పందించకపోతే పరువుపోతుందని.. ముఖ్యమంత్రి స్పందించి మృతుల కుటుంబాలకు 2లక్షల రూపాయలు ప్రకటించారని విమర్శించారు. చంద్రబాబు పర్యటనల్లో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని ఆరోపించారు. జగన్ ఎలాగూ ప్రజల్ని కలవడు,.. కలిసే నాయకులకు పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టిస్తారని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. పార్టీ కార్యకర్తల మృతి పార్టీకి తీరని లోటని నిమ్మకాయల చినరాజప్ప ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు చినరాజప్ప ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం : చంద్రబాబు సభల్లో విషాద ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా తెలిపారు. వైసీపీ నేతలు దీన్ని కూడా రాజకీయాలకు ముడిపెట్టడం తగదన్నారు. కందుకూరులో నిన్న చంద్రబాబు సభ జరిగిన ప్రాంతంలోనే గతంలో వైఎస్, విజయమ్మ, జగన్ అందరూ అక్కడే సభలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వైసీపీ సభల్లో జరిగిన దుర్ఘటనల్లో ఆ పార్టీ బాధితులకు ఒక్క రూపాయి కూడా పరిహారం అందించలేదని ఆరోపించారు. కందుకూరు సభకి భారీ ఎత్తున ప్రజలు హాజరవుతారని సమాచారం ఉన్నప్పటికీ.. పోలీసులు భద్రత కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. దుర్మార్గపు పాలన అంతం చేయడానికి ప్రజానీకం భారీ ఎత్తున చంద్రబాబు సభలకు హాజరవుతున్నారని అన్నారు. చంద్రబాబు సభలకి వస్తున్న ప్రజానీకాన్ని చూసి వైసీపీ నేతలు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు.
మానవతా విలువలు పట్టించుకోని వ్యక్తి జగన్ : మానవతా విలువలను పట్టించుకోని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కందుకూరు ఘటనకు స్పందించి బాధితులకు సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఆలోచించకుండా.. ఏ విధంగా కేసులు పెట్టాలని, ఏ విధంగా నేరారోపణ చేయాలనే దుర్బుద్ది గల ముఖ్యమంత్రికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని అన్నారు.
టీడీపీ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బాధలో తాముంటే, వైసీపీ శవ రాజకీయాలు చేస్తోందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. వైసీపీ నేతల కంటే రాబందులే నయమని.. అవి చనిపోయిన వాటిని పీక్కుతింటే.. వైసీపీ నేతలు బతికున్న వారినే పీక్కుతింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విషాద సమయంలో వైసీపీ దుష్ప్రచారాలు రాజకీయ కక్కుర్తికి పరాకాష్ట అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ప్రధాని, గవర్నర్ స్పందించేంత వరకు సీఎం స్పందించలేదని విమర్శించారు. జగన్ రెడ్డి, తన తల్లి విజయమ్మ పాదయాత్రలు చేసి, బహిరంగ సభలు కూడా కందుకూరు ఎన్టీఆర్ సర్కిల్లో నిర్వహించిన ఘటనలను గుర్తు చేశారు. ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తే.. జగన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు బహిరంగ సభకు తగిన బందోబస్తు ఏర్పాటు చేయడంలో విఫలమైందని విమర్శించారు. జగన్ పాదయాత్రలో వివిద జిల్లాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. జగన్ రెడ్డి అసమర్ధత వల్ల, కమీషన్ల కక్కుర్తి వల్ల వందల సంఖ్యలో ప్రజలు మరణించారని ఆరోపించారు.
శవ రాజకీయాలు తగదు : వైసీపీ నేతలకు శవ రాజకీయాలు తగదని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ హితవు పలికారు. జగన్ పాదయాత్రలో మండపేటతోపాటు ఇతర చోట్ల జరిగిన దుర్ఘటనలను గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఉండి వీలైతే స్పందించి సాయం చేయకుండా.. శవరాజకీయాలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ నేతలు మానవత్వం మరిచి ప్రవర్తించడం తగదని హెచ్చరించారు. అలాగే టీడీపీ కార్యకర్తల మృతికి నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టీడీపీ కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు సంతాపం తెలిపారు. తమ పార్టీ కుటుంబ సభ్యులు మృతి చెందడం తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్యకర్తల మృతి పార్టీకి తీరని లోటని అభిప్రాయం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
మృతులకు, గాయపడిన వారికి పరిహారం ప్రకటించిన టీడీపీ నేతలు : తెలుగుదేశం అధినేత చంద్రబాబు నెల్లూరు బహిరంగ సభ దుర్ఘటన చాలా దురదృష్టకరమని టీడీపీ నేత కేశినేని శివనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన కుటుంబాలకు కేశినేని ఫౌండేషన్ తరపున ఒక్కొక్కరికి 50,000 రూపాయలు, గాయపడిన ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ఆయన ప్రకటించారు. అలాగే టీడీపీ నేత వెనిగండ్ల రాము కూడా మృతుల కుంటుంబాలకు 50వేలు, క్షతగాత్రులుకు పది వేల రూపాయల ఆర్థిక సహాయం వెనిగండ్ల ఫౌండేషన్ తరుపున అందిస్తామని తెలిపారు. ఘటనపై టీడీపీ నాయకులు ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తమ కుటుంబ సభ్యులైన పార్టీ కార్యకర్తల మృతి పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహణలో అధికారుల అత్యుత్సాహం తగదని కొండెపి ఎమ్మెల్యే, టీడీపీ శాసనసభ పక్ష విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి హితవు పలికారు. ఉదయం 4గంటలకే పోస్టుమార్టం ప్రారంభించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు ఆసుపత్రికి వస్తున్నారనే సమాచారంతో హుటాహుటిన మృతదేహాలు తరలించారని మండిపడ్డారు. పోలీసులు కూడా శవ రాజకీయాలకు దిగటం దుర్మార్గమన్నారు. మహానాడు నుంచి నేటి వరకు టీడీపీ కార్యక్రమాలంటే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని డోలా ఆరోపించారు.
ఇవీ చదవండి: