Pattabhi Comments on Phone Tapping Issue: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ముఖ్యమంత్రి.. కేంద్ర సంస్థలను సమగ్ర దర్యాప్తు కోరాలని లేకుంటే పదవికి రాజీనామా చేయాలని.. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు చెబుతున్నట్లు అది కాల్ రికార్డింగ్ అయితే ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి కోటంరెడ్డికి ఆడియో క్లిప్పింగ్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఎవరి అనుమతితో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందో, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో కేంద్ర సంస్థలతో సమగ్ర విచారణ జరగాలని అన్నారు. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరుగుతోందన్నది సుస్పష్టమైందన్నారు. మంత్రులే పొంతన లేని వ్యాఖ్యలు చేస్తూ ట్యాపింగ్‌ని అంగీకరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై రెండేళ్ల క్రితమే చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారని గుర్తు చేశారు. ఫోన్ ట్యాప్ చేస్తున్నామంటూ పెద్దిరెడ్డి బహిరంగంగానే చెప్పారంటూ పట్టాభి ఓ వీడియో విడుదల చేశారు.
"అసలు ఎవరి ద్వారా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందుకు వెళ్లింది. చీఫ్ సెక్రటరీ అనుమతి ఉందా.. రాష్ట్రంలో ఏ నిర్ణయమైనా.. ముఖ్యమంత్రి చెప్తేనే చీఫ్ సెక్రటరీ అనుమతి ఇస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది. ముఖ్యమంత్రి.. కేంద్ర సంస్థలతో దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాయాలి. లేదంటే పదవికి అయినా రాజీనామా చేయాలి". - కొమ్మారెడ్డి పట్టాభి, టీడీపీ అధికార ప్రతినిధి
Payyavula Keshav Comments on Phone Tapping Issue: చీటింగ్, ట్యాపింగ్‌లలో జగన్ కింగ్ మేకర్ అని ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతోందని నాడు తాము చెప్పింది.. నేడు నిజమైందన్నారు. తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలే స్వయంగా చెబుతున్నారని ఎద్దేవా చేసారు. గతంలో ఫోన్ ట్యాపింగ్‌పై తాను మాట్లాడినందుకు తన సెక్యూరిటీ పూర్తిగా తొలగించారని ఆక్షిపించారు. వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
ఇంటిలిజెన్స్ సాప్ట్‌వేర్‌తో పాటు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మాల్వేర్ తీసుకుని నిఘా పెట్టారని ఆరోపించారు. అందుకు ప్రైవేట్ వ్యక్తులకు డబ్బులు కూడా ముట్టజెప్పారని పేర్కొన్నారు. గతంలో హైకోర్టు జడ్జిలపై వైసీపీ ప్రభుత్వం నిఘా పెట్టగా.. దానిపై దేశమంతా చర్చ జరిగిందని గుర్తు చేశారు. గతంలో పెగాసెస్, డేటాచౌర్యం అంటూ టీడీపీపై వైసీపీ నేతలు ఆరోపించి.. నిరూపించలేకపోయారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెప్పే దైర్యం వైసీపీకి ఉందా అని ప్రశ్నించారు.
"ప్రభుత్వంలో ఉన్న ఇంటిలిజెన్స్‌తో పాటు ప్రైవేటు వ్యక్తుల ద్వారా మాల్వేర్ పంపించి.. వ్యక్తుల మీద మీరు నిఘా పెట్టిన మాట వాస్తవమా.. కాదా. హైకోర్టు జడ్జిలపై కూడా నిఘా పెట్టారు అని చర్చకు వచ్చింది కదా. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో మీరు విచారణ జరిపించగలరా". - పయ్యావుల కేశవ్,ప్రజా పద్దుల కమిటీ చైర్మన్
ఇవీ చదవండి: