CM Jagan Started the Jagananna Arogya Suraksha Program: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో నేడు 'జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని' వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమం దాదాపు 45 రోజుల పాటు 5 దశల్లో జరుగుతుందని వెల్లడించారు. తొలి దశలో 15 రోజుల పాటు వాలంటీర్లు, గృహసారధులు ఈ కార్యక్రమంపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. రెండో దశలో పీహెచ్సీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి.. బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ టెస్టులతో పాటు అవసరమైతే యూరిన్, డెంగ్యూ టెస్టుల కూడా చేస్తారని సీఎం జగన్ తెలిపారు.
CM Jagan Comments: ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఏయే కార్యక్రమాలను చేయబోతున్నారో వివరించారు. ''ప్రివెంటివ్ కేర్‌లో 'జగనన్న ఆరోగ్య సురక్ష' సరికొత్త అధ్యాయం. గ్రామాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి 7 రకాల పరీక్షలు చేస్తాం. అనారోగ్యం ఉన్నవారికి చికిత్స చేయించి, ఉచితంగా మందులు ఇస్తాం. 45 రోజుల పాటు 5 దశల్లో ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతుంది. మొదటి, రెండో దశల్లో పీహెచ్సీ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షులు నిర్వహిస్తారు. మూడో దశలో హెల్త్ క్యాంపులు నిర్వహించి, ఉచితంగా చికిత్స అందజేస్తారు. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి అందరూ సహకరించాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి.'' అని సీఎం జగన్ అన్నారు.
CM Jagan Issued Orders to Officials: అంతేకాకుండా, వైద్యం కోసం పేదవారు అప్పుల పాలు కాకూడదని.. ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్య సదుపాయాలు అందించడమే.. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని సీఎం జగన్ తెలిపారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ సహా ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేస్తుండగా.. అదనంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభించామన్నారు. పేదవాడికి వైద్యం భారం కాకూడదని, ప్రభుత్వమే వారికి అన్ని విధాలా అండగా ఉండి, వైద్య సదుపాయాలు కల్పిస్తుందన్నారు. 45 రోజుల పాటు వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి జల్లెడపల్లి అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అధికారులకు ఆదేశించారు.
CM Jagan Issued Instructions to the Volunteers: 45 రోజుల పాటు 5 దశల్లో కొనసాగనున్న ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో.. వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పంచాయతీ రాజ్ సహా పలు విభాగాల అధికారులు భాగస్వామ్యులు కావాలని సీఎం జగన్ ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్షలో చేయబోయే టెస్టులు, చికిత్స, ఉచిత మందుల వివరాలను తెలియజేయాలన్నారు. 15 రోజుల పాటు వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, గృహసారధులు ఇంటింటికీ వెళ్లి కార్యక్రమంపై అవగాహన కల్పించడంతో పాటు ఫోన్లలో ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించడం, ఆరోగ్య వివరాలను నమోదు చేయిండటం వంటివి చేయాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.
''జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ప్రతి ఆరోగ్య సమస్యకు పరిష్కారం చూపించాలి. అనారోగ్యం బారిన పేదవాడి చేయి పట్టుకుని నడిపించాలి. అన్ని విధాలా సహకారం అందించాలి. ఈ కార్యక్రమం విజయవంతం చేసేలా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. అవసరమైతే నాలుగో దశలో మరోసారి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి, అవసరమైన చికిత్సలు చేయాలి. ఆరోగ్యశ్రీ సేవలు పొందినవారిని, పొందాల్సిన వారినీ మ్యాపింగ్ చేయించాలి. ఐదో దశలో హ్యాండ్ హోల్డింగ్ కార్యక్రమం చేపట్టి, అన్ని విధాలా చికిత్సలు అందించి.. సహాయ సహకారాలు అందించాలి.''- వైఎస్ జగన్, రాష్ట్ర ముఖ్యమంత్రి