CM Jagan meeting with Finance Department officials: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 14వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఇటీవలే రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నేడు ఆర్ధికశాఖ అధికారులతో సమావేశమయ్యారు. సమావేశంలో.. రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు, నవరత్న పథకాల బడ్జెట్ కేటాయింపులు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల కేటాయింపుల అంశాలపై అధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల సహా సీఎస్ జవహర్ రెడ్డి, ఆర్ధిక శాఖ అధికారులు హాజరయ్యారు.
సమావేశానికి ముందు విశాఖపట్నంలో తాజాగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను విజయవంతం చేయటంపై మంత్రులు బుగ్గన, అమర్నాథ్‌తో పాటు పరిశ్రమల శాఖ అధికారులను.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. అనంతరం మంత్రులు బుగ్గన, అమర్నాథ్‌తోపాటు పరిశ్రమల శాఖ అధికారులైనా.. కరికాల వలెవన్, సృజన, షన్మోహన్‌లను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సన్మానించారు. ఈ నెల 3, 4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో 13.41 లక్షల కోట్ల ఒప్పందాలు సాధించటంపై కృషి చేసిన ముంత్రులను, అధికారులను ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా అభినందించారు. జీఐఎస్‌లో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశామని, ఇకపై ప్రతీవారమూ ఎంఓయూల అమలును సమీక్షించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు.
ఈ నెల 14వ తేదీన ప్రారంభంకానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్.. ఉభయ సభలను (శాసనసభ, శాసనమండలి) ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించబోతున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం ఉభయ సభలు వాయిదాపడనున్నాయి. ఆ తర్వాత విధాన సభ, విధాన మండలికి సంబంధించిన సభ వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశాలు వేర్వేరుగా జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి?, ఎజెండా తదితర అంశాలను బీఏసీలో ఖరారు చేయనున్నారు.
అసెంబ్లీ సమావేశాలు, మార్చి, ఏప్రిల్ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలు చేయాల్సిన పథకాల తేదీలను ఖరారు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన వివిధ కార్యక్రమాలను.. ఎన్నికల కోడ్ ముగియనుండడంతో కార్యక్రమాలు, పథకాల అమలుకు సన్నాహాలు చేస్తున్నారు.
- మార్చి 10నుంచి మధ్యాహ్న భోజనంతో పాటుగా రాగిజావ అమలు ప్రారంభం
- మార్చి 14 నుంచి అసెంబ్లీలో సమావేశాల నిర్వహణకు నిర్ణయం
- మార్చి 18 సంపూర్ణ ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం
- జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటి పద్ధతిలో నగదు జమ
- మార్చి 22న ఉగాదిరోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్ల ప్రకటన. వీరికి ఏప్రిల్ 10న అవార్డులు, రివార్డులు
- మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం
- మార్చి 25 నుంచి వైయస్సార్ ఆసరా. ఏప్రిల్ 5 వరకూ కొనసాగనున్న కార్యక్రమం
- మార్చి 31న జగనన్న వసతి దీవెన
- ఏప్రిల్ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు
- ఏప్రిల్ 10న వాలంటీర్లకు సన్మానం
- ఏప్రిల్ 18న ఈబీసీ నేస్తం
ఇవీ చదవండి