CM Jagan on Volunteers Ki Vandanam: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంక్షేమ సారథులు వాలంటీర్లేనని అని సీఎం జగన్ అన్నారు. విజయవాడలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. 25 రకాల పథకాలకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని చెప్పేందుకు గర్వపడుతున్నానన్నారు. ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా కేవలం సేవ చేయాలనే తపనతో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నారని సీఎం ప్రశంసించారు.
ఉత్తమ సేవలందించిన వాలంటీర్లను సత్కరించారు. ప్రభుత్వ పెన్షన్లను 64లక్షల మంది లబ్దిదారులకు అందిస్తున్న గొప్ప సేవకులు, సైనికులు వాలంటీర్లను జగన్ కొనియాడారు. 2019 నుంచి 2లక్షల 66వేల మంది వాలంటీర్లు ప్రజలకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా వాలంటీర్లు ప్రజలకు మంచిని అందించే కార్యక్రమం నిర్వహిస్తున్నారని కొనియాడారు.
"రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేసే ప్రతీ మంచి పనికి, ప్రతీ సంక్షేమ పథకానికి, ప్రతీ మేలుకు సారథులు, వారధులు, దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఉన్న పరిస్థితిని వాలంటీర్ల ద్వారానే జరుగుతుందని చెప్పడానికి గర్వపడుతున్నా. తులసి మొక్క లాంటి వ్యవస్థే.. ఈ వాలంటీర్ వ్యవస్థ. ఈ వ్యవస్థ ఎంత మేలు చేస్తుందో వివరించే నైతికత కూడా కేవలం మీ సొంతం మాత్రమే. దాదాపు 25 రకాల పథకాలకు సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్లుగా మీరే ప్రతి గడప దగ్గరకు వెళ్తున్నారు. ఈ ప్రభుత్వంలో మీరు చేస్తున్నది సేవ మాత్రమే అనేది గుర్తు పెట్టుకోవాల్సిన అంశం"-వైఎస్ జగన్, ముఖ్యమంత్రి
నిజాలు చెప్పగలిగే సత్య సాయుధులు వాలంటీర్లని జగన్ అన్నారు. ప్రతి ఇంటికి నేరుగా వెళ్లగలిగే వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వానికి అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వాన్ని ప్రతి గడప వద్దకు తీసుకెళ్లగలిగినందున, ప్రతి ఇంట్లో మంచి జరిగిందో లేదో ధైర్యంగా అడిగే హక్కు వాలంటీర్లతోనే సాధ్యమైందన్నారు. వాలంటీర్ వ్యవస్థ ప్రతి గడపలో మంచి తప్ప చెడు ఎక్కడా చేయలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా డిబిటి, నాన్ డిబిటి పథకాల ద్వారా ఇప్పటి వరకు 3లక్షల రూపాయల కోట్ల రుపాయల విలువైన మంచిని నాలుగేళ్లలో ప్రజలకు అందించినట్లు సీఎం జగన్ చెప్పారు.
సంక్షేమ పథకాలకు సారథులు, వారధులు వాలంటీర్లే అన్న.. ప్రభుత్వం వచ్చాక మార్పులకు సాక్ష్యాలు వాలంటీర్లే అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వాలంటీర్లు ఉన్నారని తెలిపారు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదని.. స్వచ్ఛంద సేవకులని సీఎం జగన్ కొనియాడారు. వాలంటీర్లను లీడర్లుగా చేస్తానని తొలి సభలోనే చెప్పానన్న సీఎం.. ఈ ఏడాది 2లక్షల 33వేల 719 మంది వాలంటీర్లకు 239 కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నట్లు వివరించారు. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి జరిగిన మంచి తెలపాలని సూచించారు.
ఇవీ చదవండి:
- High temperatures in the state : వడదెబ్బ అంటే తెలుసా..? ఆ ప్రభావం ఎలా ఉంటుందంటే..!
- Electric Shock: చిత్తూరు జిల్లాలో విషాదం.. నీటి సంపు శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి
- Software Employee Wife Murder Updates: స్నేహితుడే ఈ ఘోరానికి పాల్పడ్డాడా?.. జిల్లెళ్లపాడు హత్య కేసులో విస్తుపోయే విషయాలు