Tension in Tiruvur Constituency: తిరువూరులో వైసీపీ, టీడీపీ సవాళ్ల నేపథ్యంలో పోలీస్ పహారా దాటి తెలుగుదేశం పార్టీ నాయకుడు కొమ్ము బాబురావు బయటకు వచ్చారు. దీంతో వైసీపీ నాయకురాలు, కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద నుంచి వైసీపీ నియోజకవర్గ కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టారు. పట్టణంలో పోలీసులను భారీగా మోహరించారు.
పరస్పర సవాళ్లు.. తిరువూరు పట్టణంలోని బోసుబొమ్మ కూడలి వద్ద ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నేతలు.. టీడీపీ నేతలు పరస్పర సవాళ్లు చేసుకున్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల్లో తిరువూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమంటే.. తామూ సిద్ధమేనని ఇరుపార్టీల నేతలు సమాయత్తం కావడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ముందుగానే పోలీసులు అరెస్టులు, గృహనిర్భంధాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి వాసం మునియ్యను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి తిరువూరు స్టేషన్‌కు తరలించారు. ఆయనకు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు వస్తున్నారనే సమాచారంతో మునియ్యను మైలవరం స్టేషన్‌కు తరలించారు. శాంతినగర్‌లోని నివాస గృహంలో మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ ఎన్ సుధారాణి, తిరువూరు పట్టణ కమిటీ అధ్యక్షుడు బొమ్మసాని ఉమామహేశ్‌ను గృహనిర్భంధించారు. తిరువూరు, ఎ.కొండూరు, విస్సన్నపేట మండలాలకు చెందిన మరికొందరు నేతల కదలికలపై నిఘా పెట్టారు. తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు వైసీపీ నేతలు తంగిరాల వెంకటరెడ్డి, పరసా శ్రీనివాసరావు, యరమల రామచంద్రారెడ్డి, తదితరులను పోలీసులు గృహనిర్భంధించారు.
ట్విట్టర్ వేదికగా.. తెలుగుదేశం పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడాన్ని ఎంపీ కేసినేని నాని ట్విట్టర్ వేదికగా ఖండించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం చేతకాకపోగా బహిరంగ చర్చకు భయపడి ఇటువంటి చర్యలకు పాల్పడటం అసమర్థ ఎమ్మెల్యే రక్షణనిధి పిరికి పంద చర్యకి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. అరెస్టు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
శాంతియుత నిరసన.. టీడీపీ నేతల అక్రమ అరెస్టులపై అంబేడ్కర్ విగ్రహం ఎదుట సోమవారం ఉదయం 10 గంటలకు శాంతియుత నిరసన తెలియజేస్తున్నట్లు తెలుగుయువత నాయకులు, కార్యకర్తలు సిద్ధపడుతున్నారు. అయితే బహిరంగ చర్చకు ఎటువంటి అనుమతులు లేదని తిరువూరు పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ఎవరెవరిని అరెస్ట్ చేశారంటే.. తిరువూరుకు తరలి వెళ్తున్న విస్సన్నపేట టీడీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తిరువూరు నియోజవర్గం అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని విజయవాడ ఎంపీ కేసినేని నాని మాత్రమే నియోజవర్గంలో అభివృద్ధి పనులు చేశారని తమ వద్ద లెక్కలతో సహా వివరాలు ఉన్నాయన్నారు. టీడీపీ నాయకులు ఆకుల రాధాకృష్ణ, షేక్ అమానుల్లా ,నాదెళ్ల నాగమణి, అనసాని లాలయ్య ,గంజినబోయిన శ్రీనివాసరావు ,పల్లెపము రాంబాబు, కమతం సురేష్ ,కొంగల శ్రీనివాసరావు, సుల్తాన్ ,జమలారావు పాల బుజ్జి తదితరులను హౌస్ అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి: