Central Excise Society Employee Scam: సెంట్రల్ ఎక్సైజ్ శాఖను.. డిపాజిట్ల స్కాం కుదిపోస్తోంది. ఉద్యోగులు, పింఛన్‌దారులు కష్టపడి సంపాదించిన డబ్బులు.. భవిష్యత్తుకు ఉపయోగపడతాయని దాచుకుంటే రూ.7 కోట్ల వరకూ సొసైటీ సెక్రటరీ జె.ఎస్.చక్రవర్తి వాటిని గోల్‌మాల్ చేశాడు. ప్రస్తుతం ఎవరి డబ్బులు ఎంత కాజేశాడనే స్పష్టత కూడా ఇవ్వకపోవడంతో వారి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. కొందరు నెల నెలా వచ్చే జీతంలో కొంత దాచుకోగా.. మరికొందరు వడ్డీ ఎక్కువ వస్తుందనే ఆశతో పదవీ విరమణ తర్వాత వచ్చిన డబ్బులు మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా ఉంచారు. వాటన్నింటినీ చక్రవర్తి మాయం చేశాడు.
ఆ లెక్కలు కూడా ప్రస్తుతం ఎక్కడా దొరకకుండా చేశాడు. తమ డబ్బులు ఇప్పించమంటూ పోలీస్‌స్టేషన్ చుట్టూ బాధితులు తిరుగుతున్నారు. దీంతో ఎవరెవరు ఎంత డబ్బులు దాచుకున్నారనే లెక్కలను తేల్చేపనిలో పోలీసులున్నారు. తాజాగా సూర్యారావుపేట పోలీసులు బాధితులకు ఫోన్లు చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఎవరెవరు ఎంత మొత్తంలో సొసైటీలో ఉంచారో, వివరాలు, ఆధారాలతో సహా తీసుకురమ్మని పిలుస్తున్నారు. గోల్‌మాల్ చేసిన 41మందికి చెందిన డిపాజిట్ల వివరాలను చక్రవర్తి పోలీసులకు చెప్పినప్పటికీ.. ఇవన్నీ తప్పులతడకగా ఉన్నాయని బాధితులు అంటున్నారు.
చక్రవర్తి భారీగా అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ ఆధారాలతో సహా మూడేళ్ల కిందట(2022 జులై) సంస్థ ఉన్నతాధికారులకు, సూర్యారావుపేట పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్‌కు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. అప్పట్లోనే రూ.6.34కోట్ల వరకూ గోల్‌మాల్ చేసినట్టు లెక్కలతో సహా ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఐపీసీ 403 నిధుల దుర్వినియోగం, సొంతానికి వినియోగించుకోవటం, 406 నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, 420 సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. అయినా ఎవరూ దీనిని పట్టించుకోలేదని.. శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు. ఉన్నతాధికారులను సైతం చక్రవర్తి లోబర్చుకుని.. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చక్రం తిప్పాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2020లో చక్రవర్తిపై ఫిర్యాదులు అందిన తర్వాత సహకార సంఘం ఆధ్వర్యంలో రికార్డులన్నింటినీ పరిశీలించారు. సంఘంలో డబ్బులు దాచిన ఉద్యోగులు, పింఛన్‌దారులందరినీ విచారించారు. అప్పట్లోనే రూ.6.34 కోట్ల వరకూ చక్రవర్తి కాజేసినట్టు గుర్తించారు. కానీ.. చక్రవర్తిపై మాత్రం శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. మూడేళ్లుగా వ్యవహారాన్ని సాగదీస్తూ వచ్చారు. ఈ మూడేళ్లలో చక్రవర్తి దర్జాగా ఉద్యోగంలోనే కొనసాగాడు. అంతర్గత విచారణ పేరుతో మూడేళ్లు కాలయాపన చేసి.. చక్రవర్తి భారీ కుంభకోణానికి పాల్పడినట్టు తేల్చారు. దాంతో అతడిని ఏ1 నిందితుడిగా చేర్చి ఎట్టకేలకు ఈ నెల 17న అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మోసపోయిన ఉద్యోగులు, ఫించన్‌దారులకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. చక్రవర్తి చేసిన గోల్‌మాల్ వెనుక సంస్థకు చెందిన కొందరు ఉన్నతాధికారులు కూడా ఉన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సంఘం అధ్యక్షుడు, డైరెక్టర్లను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు నిజాలు వెలుగులోనికి వస్తాయని పోలీసులు, సెంట్రల్ ఎక్సైజ్ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.