BHAVANI DEEKSHA VIRAMANA: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. నేటి నుంచి ఈనెల 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. వేకువజామున మూడు గంటలకు ప్రధానాలయంలో అమ్మవారికి సుప్రభాత సేవ, స్వపనాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో భ్రమరాంబ, స్థానాచార్యులు విష్ణుభొట్ల శివప్రసాదశర్మ, ఇతర ఆలయ వేద పండితులు మంగళవాయిద్యాల నడుమ మూడు హోమగుండాలకు అగ్ని ప్రతిష్ఠాపన చేశారు.
కరోనా అనంతరం భారీగా తరలివస్తున్న భవానీలు: హోమగుండాలను వెలిగించిన తర్వాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. అంతకు ముందు భక్తులు ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేసేందుకు ఈసారి అధికారులు అనుమతించారు. హోమగుండాల్లో భవానీలు తమ వెంట నెయ్యితో నింపి తీసుకొచ్చిన కొబ్బరికాయలను వేసి దుర్గమ్మ తమను చల్లగా చూడాలని వేడుకుంటున్నారు. గత రెండేళ్లు కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే భవానీలు ఇంద్రకీలాద్రికి వచ్చారు. ఈసారి కరోనా ఆంక్షలను పూర్తిగా సడలించడంతో రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు, ఒడిస్సా నుంచి కూడా భక్తులు భవానీమాల వేసుకుని దుర్గమ్మ క్షేత్రానికి తరలివచ్చారు.
పదిలక్షల మంది భక్తులు వస్తారని అంచనా: ఈరోజు ప్రారంభమైన ఉత్సవాలు ఐదు రోజులపాటు జరగనున్నాయి. భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకుని భవానీ మాల విరమణ కోసం నిర్దేశించిన ఐదు రోజులకు అదనంగా మరో రెండు, మూడు రోజులు కూడా ఏర్పాట్లను యథాతథంగా ఉంచాలని దేవస్థానం భావిస్తోంది. సుమారు ఏడు లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు.. అందుకు అనుగుణంగా భవానీల కోసం తాత్కాలిక షెడ్లు, కేశ ఖండనశాలలు ఏర్పాటు చేశారు. వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధి వరకు ఐదు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భవానీలకు ఉచితంగానే దర్శనం కల్పిస్తున్నామని ఈవో తెలిపారు.
దీక్ష విరమణకు ముందు కృష్ణానదిలో జల్లు స్నానాలు: భవానీదీక్ష దారులతోపాటు ఇతర భక్తులు కూడా అమ్మవారి దర్శనం కోసం వస్తున్నందున వారి కోసం 100, 300, 500 రూపాయల అంతరాలయ దర్శనాలను అందుబాటులో ఉంచామన్నారు. ఘాట్ రోడ్డు ద్వారా భక్తులను అమ్మవారి ఆలయంలోకి అనుమతిస్తున్నారు. జగన్మాత దర్శనం అనంతరం వారంతా మల్లిఖార్జుస్వామి ఆలయం మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు చేరుకుని... ఇరుముడులను గురుస్వాములకు అందించి హోమగుండాల్లో పూజాద్రవ్యాలను వేసి దీక్ష విరమణ చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన విజయవాడ చేరుకుంటున్న వారంతా దీక్ష విరమణకు ముందు కృష్ణానదిలో జల్లు స్నానాలు ఆచరించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
దీక్ష దారుల కోసం మూడు వందల మందికిపైగా గురుభవానీలు: త్రిభువనేశ్వరి... శ్రీచక్రరాజ పురవాసిని అయిన- కనకదుర్గాదేవి భవానీదీక్షను.... లింగబేధాలు, వయోభేదాలు లేకుండా అంతా ఆచరిస్తున్నారు. ఎర్రటి వస్త్రాలు ధరించి, చందనం, కుంకుమ బొట్టు ధారణ చేసి... 108 ఎర్రని పూసల దండ వేసుకుని నిత్యం కనకదుర్గా స్తోత్రం పఠించి... అర్ధమండల, మండలదీక్షలు పూర్తి చేసి దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. ఏటా మార్గశిర బహుళ సప్తమి నుంచి ఏకాదశి వరకు భవానీ దీక్ష విరమణలకు సమయంగా వైదిక కమిటీ నిర్ణయించింది. ఈ ఐదు రోజులు శతచండీ యాగం కొనసాగుతుంది. ఈనెల 19వ తేదీ ఏకాదశి రోజున ఉదయం 10.30 గంటలకు మహాపూర్ణాహుతితో దీక్షలు పరిసమాప్తం అవుతాయి. దీక్ష దారుల కోసం మూడు వందల మందికిపైగా గురుభవానీలు ఆలయంలో అందుబాటులో ఉంచారు.
విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు: దీక్షాపరులకు అమ్మవారి అన్నప్రసాదం తొలుత ప్యాకెట్లలో అందించాలని భావించినా.. ఆ ప్రతిపాదనపై విమర్శలు రావడంతో కూర్చుని తినేలా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. అయితే భోజన ఏర్పాట్లపై పోలీసుల నుంచి కొంత ప్రతికూలత రావడంతో ఏర్పాట్లలో ఆలస్యం జరిగింది. భారీగా భవానీలు తరలిరావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. విజయవాడ నగరంలో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ వాహనాలు నగరంలోకి రాకుండా మళ్లింపు మార్గాల్లో పంపిస్తున్నారు. ఇతర వాహనాలు కూడా భవానీల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లోకి రానీయకుండా నియంత్రిస్తున్నారు.
ఇవీ చదవండి: