BC SAADHIKAARA SAMAAKHYA: స్థానిక సంస్థల ఎన్నికల్లో కోర్టు తీర్పును బూచిగా చూపి బీసీలకు రాజ్యాధికారాన్ని వైసీపీ ప్రభుత్వం దూరం చేసిందని బీజేపీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. 26 వేల మంది బీసీలకు స్థానిక సంస్థల్లో పదవులు రావాల్సి ఉన్నా.. 15 వేలకు మాత్రమే పరిమితం చేసిందని ఆయన మండిపడ్డారు. సమగ్ర కుల గణన చేపట్టాలని ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన వెంకట సత్యనారాయణ.. 105 రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు కులగణన చేసే హక్కులు కేంద్రం ఇచ్చిందని, అయితే వాటిని రాష్ట్రాలు అమలు చేయడం లేదని ఆయన తెలిపారు. కులాల పేరుతో బీసీల్లో చీలిక తెచ్చి 54 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి విధులు కేటాయించకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలు ఇప్పటికే కులగణనను చేపట్టారని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే సమగ్ర కులగణన చేపట్టాలని బీసీ సాధికార సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జయప్రకాష్ కోరారు. ఈ దేశంలోని సమాజం మొత్తం కుల వ్యవస్థపై ఆధారపడి ఉన్నప్పుడు.. ఈ దేశంలోని అన్ని సమగ్ర శాస్త్రీయ కులాల లెక్కలు జరగాలి. ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాలలో ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
"బిహార్, ఒడిశా రాష్ట్రాల్లో జరుగుతున్న విధంగా మన రాష్ట్రంలో కూడా సమగ్ర కుల గణన జరిపించాలని కోరుతూ మేము ఈ అఖిల పక్ష సమావేశం నిర్వహించాము. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు సమాచారం అందించాము. ఆ క్రమంలో వారి ప్రతినిధులు సమావేశానికి విచ్చేశారు. ఈ దేశంలోని సమాజం మొత్తం కుల వ్యవస్థపై ఆధారపడి ఉన్నప్పుడు.. ఈ దేశంలోని అన్ని సమగ్ర శాస్త్రీయ కులాల లెక్కలు జరగాలి. ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాలలో ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే మన రాష్ట్రంలో కూడా సమగ్ర కుల గణన జరగాలని మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. కేంద్ర ప్రభుత్వం 105 రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలే కుల గణన జరిపించాలని ఆదేశించిన క్రమంలో మన రాష్ట్రంలో కూడా కుల గణన జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాము." - జయప్రకాష్, బీసీ సాధికార సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు