DAV School Reopening Today: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ డీఏవీ పాఠశాల ఘటనలో పాఠశాల గుర్తింపు రద్దు చేసిన విద్యాశాఖ.. మళ్లీ దానిని తెరిచేందుకు అనుమతిచ్చింది. మిగిలిన విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది విద్యా సంవత్సరం వరకు పాఠశాల తెరిచేందుకు అనుమతులు జారీ చేసింది. దీంతో నేడు పాఠశాల తిరిగి ప్రారంభమైంది. ఈ విషయం తెలుసుకున్న బాధిత చిన్నారి తల్లిదండ్రులు.. పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం లేకుండా పాఠశాలను తెరిచారంటూ పాఠశాల ఎదుట బైఠాయించారు. నిందితులకు శిక్ష పడే వరకు పాఠశాలను మూసే ఉంచాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే..: గత నెల 19న బంజారాహిల్స్‌లోని డీఏవీ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్న ఓ నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్ డ్రైవర్ లైంగిక దాడి చేశాడు. దీంతో పాఠశాల ప్రిన్సిపల్ మాధవితో పాటు డ్రైవర్ రజనినీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత చిన్నారి తల్లిదండ్రులు, వివిధ సంఘాల నేతలు పాఠశాల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కోరితే.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాఠశాల గుర్తింపు తక్షణమే రద్దు చేయాలని డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇందులోని విద్యార్థులను వేరే స్కూల్‌లో చేర్పించేందుకు సన్నాహాలు చేశారు.
అయితే మిగిలిన తల్లిదండ్రులు తమ పిల్లల చదువు మధ్యలో ఆగిపోకుండా ఉండాలంటే స్కూల్‌ను కొనసాగించాలని విద్యాశాఖ కమిషనర్ వద్ద తమ గోడును మొరపెట్టుకున్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల అందరితో సంతకాలు సేకరించి విద్యాశాఖకు పంపించారు. దీంతో విద్యాశాఖ పాఠశాలను ఈ ఏడాది వరకు పాఠశాల నిర్వహణకు అనుమతించింది. ఈ క్రమంలోనే పాఠశాలను నేడు రీఓపెన్ చేశారు.
ఇవీ చదవండి: