Chandra Babu: రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని...వచ్చే ఏడాది మే లేదా డిసెంబర్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయనే చర్చ వివిధ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ తీరే ముందస్తు ఎన్నికలకు దారితీసే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. రేపు నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించనున్న చంద్రబాబు... సంబంధిత ఏర్పాట్లపై నేతలతో చర్చించారు. ముందస్తు ఎన్నికలపై కీలక ప్రకటన చేసిన చంద్రబాబు... తొలి ప్రాధాన్యంగా కర్ణాటకతో కలిసి మేలోగానీ, లేదంటే తెలంగాణతోపాటు వచ్చే డిసెంబర్‌లో జగన్ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. వాలంటీర్‌ల వ్యవస్థ, అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలిచేందుకు వైకాపా కుయుక్తులు పన్నుతోందని...సమర్థంగా తిప్పికొట్టేందుకు తెదేపా శ్రేణులు సిద్ధంగాఉండాలన్నారు. నిత్యావసర ధరలు, ఆసుపత్రుల్లో మందుల కొరత, ఇసుక, మద్యం మాఫియాతో వివిధ రంగాల కుదేలు, కుంటపడిన అభివృద్ధి వంటి ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలని నేతలకు పిలుపునిచ్చారు.
రోడ్‌షోలతో ప్రజల్లో ఉండేలా తానూ ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. వచ్చే వారం కర్నూలు లేదా రాయలసీమలోని 2 నియోజకవర్గాల్లో పర్యటనకు సమాయాత్తం అవుతున్నారు. ఒకరోజు బాదుడే బాదుడు పేరుతో జిల్లాలోని 2నియోజకవర్గాల్లో రోడ్ షోలు, తదుపరి రోజున ఆ పార్లమెంటు పరిధిలో ఉండే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. అంతకు ముందే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలతో ముఖాముఖీ సమావేశాలు పూర్తి చేయనున్నారు. ఇప్పటికే 125 అసెంబ్లీ నియోజకవర్గాలకు పైగా సమీక్షలు పూర్తి చేశారు. సంక్రాంతి తర్వాత లోకేశ్ పాదయాత్ర ఉండే అవకాశం ఉండటంతో ఈలోగా దాదాపు 60నియోజకవర్గాలలో చంద్రబాబు రోడ్‌షోలు పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
దేవినేని: నందిగామలో ఈనెల 4వ తేదీన జరిగే చంద్రబాబు రోడ్ షోను విజయవంతం చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. నందిగామ, చందర్లపాడు మండల పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించిన దేవినేని.. నందిగామ గాంధీ సెంటర్లో చంద్రబాబు బహిరంగ సభ జరగకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ సభ నిర్వహించి తీరుతామని చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పోలీసు ఉన్నతాధికారులను కలిసి అనుమతులు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 42 నెలలుగా అధికార వైకాపా పార్టీ.. అధికార దుర్వినియోగం చేస్తూ భారీగా దోపిడీకి పాల్పడుతుందని ఆరోపించారు. నందిగామలో ఒక్కసారి వైకాపాకు అవకాశం ఇచ్చినందుకు అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని,.. ఎమ్మెల్యే సోదరులు భారీగా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయన్నారు. రైతులు జేబులో ఖాళీ చేయడానికే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు అని ఆరోపించారు. చంద్రబాబు సభను విజయవంతం చేసేందుకు అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు.
ఇవీ చదవండి: