Atchannaidu Letter on CM Jagan Administration: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసి, పరిపాలన ప్రారంభించిన రోజు నుంచి ఈనాటి దాకా జరిగిన పలు కీలక పరిణామాలు, పంచాయతీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సబ్‌ప్లాన్ నిధులు, సంక్షేమ పథకాల మాటున పన్నులు, ఛార్జీల వీర బాదుడుపై.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ విడుదల చేశారు. జగన్ రెడ్డి పేదల పేరుతో కొంగ జపం చేస్తూ.. కపట ప్రేమ చూపుతున్నాడంటూ దుయ్యబట్టారు. జగన్ రెడ్డి పేదల్ని బిచ్చగాళ్లని చేశాడంటూ అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు.
Atchannaidu Fire on CM Jagan: పేదల ద్రోహి జగన్‌కి.. ఐదు కోట్ల జనానికి మధ్య యుద్ధమని.. అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. తన అవ లక్షణాలు ఎదుటివారికి అంటగట్టి. చెప్పిన అబద్దాన్నే వందసార్లు చెప్పడం జగన్ రెడ్డి నైజమని మండిపడ్డారు. జగన్ రెడ్డి పేదల పేరుతో కొంగ జపం చేస్తూ కపట ప్రేమ చూపుతున్నాడంటూ విమర్శించారు. పేదలపై ప్రేమ నిజమైతే పేదల కోసం చంద్రన్న పెట్టిన 120 పథకాలు ఎందుకు రద్దు చేశారని అచ్చెన్నాయుడు నిలదీశారు.
Atchannaidu on Skill Development Scam: 'చంద్రబాబును 30ఏళ్లుగా చూస్తున్నా.. తప్పు చేయరు.. ఎవరినీ చేయనివ్వరు'
Atchannaidu on SC, ST, BC, Minority Sub Plan Funds: అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సబ్ ప్లాన్ నిధులు 1.14 లక్షల కోట్లను ఎందుకు మళ్లించారంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. బీసీలకు 10శాతం రిజర్వేషన్లు కోత కోసి, 16 వేల 800 రాజ్యాంగబద్ద పదవులను దూరం చేయడమేనా ఉద్దరించడమంటే అని నిలదీశారు. సలహాదారులు, వైస్ ఛాన్సులర్లు, తిరుమల తిరుపతి దేవస్థానం, ఏపీఐఐసీ లాంటి ఉన్నత పదవుల్లో బడుగులకు నియామకాలు ఎక్కడ అని ప్రశ్నించారు. నాసిరకమైన మద్యంతో 20వేల మంది పేదల ప్రాణాలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుకను రద్దు చేసి 125 కుల వృత్తుల వ్యాపారాలను దెబ్బతీశారన్నారు.
Atchannaidu on Unemployment Benefits: అంతేకాకుండా, నిరుద్యోగ భృతి రద్దు చేసి పేద యువతకు నమ్మక ద్రోహం చేశారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల మాటున పన్నులు, ఛార్జీల బాదుడు.. వాస్తవం కాదా అని నిలదీశారు. టీడీపీ సంక్షేమం పేదల్ని సొంత కాళ్లపై నిలబెడితే.. జగన్ రెడ్డి పేదల్ని బిచ్చగాళ్లని చేశాడంటూ విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డిని ఇక భరించలేమని రాష్ట్రంలోని పేదలంతా నినదిస్తున్నారని అన్నారు. ల్యాండ్-శాండ్-వైన్-మైన్ మాఫియాలకే జగన్ రెడ్డి కావాలి కానీ.. పేదలకు కాదని ఆక్షేపించారు. జగన్ రెడ్డిని మించిన పెత్తందారు.. పేదల ద్రోహి ఎవరూ లేరని.. లక్షల కోట్ల దోపిడీపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు క్లాస్ వార్ చేస్తున్నారంటూ అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.
Atchannaidu Letter Details: అచ్చెన్నాయుడు విడుదల చేసిన లేఖలో..''నాలుగున్నరేళ్లుగా జగన్ రెడ్డి కంటికి వైసీపీ ప్రజాప్రతినిధులు కనిపించలేదు. తాడేపల్లి ప్యాలెస్లోకి వారికి అనుమతి లేదు. పంచాయతీల నిధులు రూ.8,600 కోట్లు దారి మళ్లింపును ప్రశ్నించిన వైసీపీ సర్పంచులపై లాఠీ ఛార్జీ చేయించారు. అక్రమ కేసులతో జైల్లో పెట్టారు. ఎన్నికలు సమీపించడంతో ఇప్పుడు వైసీపీలోని ప్రజాప్రతినిధులపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సొంత కాళ్లపై నిలబెట్టేందుకు ప్రవేశపెట్టిన 120 సంక్షేమ పతకాలను జగన్ రెడ్డి రద్దు చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సబ్ ప్లాన్ నిధుల్ని రూ.1.14 లక్షల కోట్లను జగన్ రెడ్డి దారి మళ్లించారు. 14 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్ని కాజేస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 10శాతం రిజర్వేషన్లు కోత కోసి 16,800 రాజ్యాంగబద్ధ పదవుల్ని దూరం చేశారు. బీసీ జనగణన తీర్మానంపై కేంద్రాన్ని కనీసం ప్రశ్నించకుండా ద్రోహం చేస్తున్నారు. ఆదరణ పథకాన్ని రద్దు చేసి చేతి వృత్తుల వారిని దగా చేశారు. విదేశీ విద్య, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, స్టడీ సర్కిల్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లాంటి విద్యా పథకాలు దూరం చేశారు.'' అని ఆయన వివరించారు.
''సీఎం జగన్.. పేదల కాలనీల్లోని స్కూళ్లను మూసివేసి 3లక్షల మంది చిన్నారులకు చదువులు దూరం చేశారు. ప్రశ్నించిన వందలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్ని హత్య చేశారు. వేల మందిపై దాడులకు పాల్పడ్డారు. తప్పుడు కేసులతో వేధింపులకు దిగారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అధికంగా ఉండే అమరావతి రాజధానిని ధ్వంసం చేశారు. ప్రభుత్వ సలహాదారులు, వైస్ ఛాన్సులర్లు, టీటీడీ, ఏపీఐఐసీ లాంటి రాష్ట్ర స్థాయి ఉన్నత సంస్థలకు ఛైర్మన్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నామమాత్రం చేసి, సామాజిక న్యాయం గొంతు కోశారు.''- అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు