AP Professional Forum Response to Chandrababu Arrest: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపేనని ఏపీ ప్రొఫెషనల్ ఫోరం అభిప్రాయపడింది. చంద్రబాబు అరెస్టు తీరును ఖండించిన ఫోరమ్.. రాజకీయ ప్రయోజనాల కోసమే వైసీపీ ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిందని ఫోరం ప్రతినిధులు, వివిధ ప్రజాసంఘాలు, రాజకీయపక్షాల నేతలు అభిప్రాయపడ్డారు. "రాజ్యాంగ రక్షకులే రాజకీయ ఒత్తిళ్లతో రాజ్యాంగ భక్షకులయ్యారా" అనే అంశంపై విజయవాడలోని ఓ హోటల్లో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఫోరం అధ్యక్షుడు నేతి ఉమా మహేశ్వరరావు అధ్యక్షత వహించారు.
YCP Administration in AP: ఈ కార్యక్రమంలో జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సీపీఐ నేత అక్కినేని వనజ, అమరావతి రాజధాని రైతుల సమాఖ్య కన్వీనర్ పువ్వాడ సుధాకర్, సీనియర్ జర్నలిస్టు చెవులు కృష్ణాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైసీపీ పరిపాలన తీరును ఎండగట్టారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరును ముక్తకంఠంతో ఖండించారు. గవర్నర్ అనుమతి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు సరికావని ఇవాళ్టి పాలకులే రేపు ప్రతిపక్షంలో కూర్చుంటామనే సంగతి మర్చిపోకూడదని హితవు పలికారు. చిన్న చిన్న ఉద్యమాలను సైతం అణిచివేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఇలాంటి నియంతృత్వ విధానాలను పార్టీలకతీతంగా అన్ని వర్గాలు ఖండించాలని పలు ప్రజాసంఘాల ప్రతినిధులు, రాజకీయపక్షాల నేతలు పిలుపునిచ్చారు.
National Kakatiya Seva Samakhya has Condemned Chandrababu Arrest: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టును జాతీయ కాకతీయ సేవా సమాఖ్య తీవ్రంగా ఖండించింది. చంద్రబాబు అరెస్టు రాజకీయ లబ్ధి కోసమేనని ఆరోపించింది. రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉందన్న కాకతీయ సేవా సమాఖ్య ఆయనను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. విజయవాడ శివారు గుంటుపల్లి సెంటర్లో ఏపీ కాకతీయ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కాకతీయ సేవా సమాఖ్య ప్రతినిధులు చంద్రబాబు అరెస్టును నిరసించారు.
Chandrababu Illegal Arrest: ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని, నోట్ ఫైలు ఎక్కడ మాయమైందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు, మంత్రులు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారని.. వాటిని అమలు చేయాల్సింది అధికారులేనని గుర్తుచేసిన కాకతీయ ప్రతినిధులు.. ఈ కేసులో అధికారులను సీఐడీ అధికారులు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఈ ప్రాజెక్టు మంత్రి మండలిలో ఆమోదం పొందిందని, అసెంబ్లీలో సైతం బడ్జెట్ ఆమోదం పొందిందని గుర్తుచేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై మేధావులు మౌనం వీడాలని కాకతీయ సేవా సమాఖ్య ప్రతినిధులు కోరారు.